Jun 18,2022 06:18

మోడీ ప్రభుత్వం ఒకవైపున 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు సాగిస్తున్నది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో మోడీ సాగిస్తున్న ఆర్భాటం చూస్తున్నాం. మరోవైపున ఆంధ్రప్రదేశ్‌ లోని గిరిజన గ్రామాల్లో పేదరికంలో మగ్గుతున్న ప్రజల దుస్థితి వర్ణనాతీతంగా వుంది. జూన్‌ 14వ తేదీ నుంచి 'జనం కోసం సిపిఎం' పిలుపులో భాగంగా సిపిఎం నాయకులు కిల్లో సురేంద్ర, వి.ఉమామహేశ్వరరావు, అనంతగిరి మండల జెడ్పిటీసి సభ్యులు డి.గంగరాజులుతో కలిసి అనంతగిరి మండలంలో పాదయాత్ర ప్రారంభించార. చిలకలగెడ్డ నుంచి మర్రివలస, పిసిని గ్రామాలకు 14 కిలోమీటర్లు జీపులో అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది. రోడ్డు అత్యంత ప్రమాదకరంగా వుంది. ఈ పాదయాత్ర జూన్‌ 20 వరకు సాగుతుంది. రొంపిల్లి, ఎన్‌.ఆర్‌.పురం, గరుగుబల్లి, భీంపోలు, గుమ్మకోట పంచాయితీల్లో 76 కిలోమీటర్ల పాదయాత్ర సాగుతుంది. ఈ ఐదు పంచాయితీల్లోని 61 గ్రామాల్లో పూర్తిగా గిరిజనులే జీవిస్తున్నారు. కాని ఈ గ్రామాలను 5వ షెడ్యూల్లో కలపనందు వల్ల గిరిజన చట్టాలేవీ ఈ ప్రాంత గిరిజనులకు వర్తించడంలేదు. భూస్వాముల కుట్రల వల్ల ప్రభుత్వం ఈ గ్రామాలను నాన్‌ షెడ్యూల్‌ గ్రామాలుగా కొనసాగిస్తున్నది. ఈ గ్రామాలన్నింటిని షెడ్యూల్‌ గ్రామాల కింద ప్రకటించాలని తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. గిరిజనేతరులు ఈ ప్రాంతం లోని గిరిజనుల భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి కాజేస్తున్నారు. ప్రతి పంచాయితీ లోను వందలాది ఎకరాలు గిరిజనేతరుల కబ్జా కోరల్లోకి ఇప్పటికే వెళ్ళాయి. గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోరాడి కొన్ని గ్రామాల్లో తిరిగి గిరిజనులు భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. దీనికి సిపిఎం పూర్తిగా మద్దతు ఇస్తున్నది.
జూన్‌ 14వ తేదీన రొంపిల్లి పంచాయితీలోని మర్రివలస, పసిని గ్రామాల్లో పాదయాత్ర సాగింది. నాయకులు స్వయంగా ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఈ 5 పంచాయితీలకు రోడ్డు సౌకర్యం ఏమాత్రం లేదు. చిలకలగెడ్డ నుంచి కాలినడకన ప్రయాణించాల్సిందే. బాగా ఎండలున్న కొద్దికాలంలోనే వాహనాలు అతి కష్టం మీద తిరుగుతాయి. మిగిలిన సమయాల్లో బరువులు నెత్తిన మోసుకుంటూ కాలినడకన ప్రయాణం సాగించాల్సిందే. రోగాలొస్తే డోలీలో హాస్పటల్‌కు తీసుకెళ్ళాలి. ఈ గ్రామాల ప్రజలు ఆరోగ్య సమస్యలు వస్తే 50 కిలోమీటర్ల దూరంలో భీమవరంలో ఉన్న పిహెచ్‌సికి వెళ్ళాలి. గత సంవత్సరం డోలీలో హాస్పటల్‌కు తీసుకెళ్తుండుగా మధ్య దారిలోనే ముగ్గురు చనిపోయారు. ప్రతి సంవత్సరం వందలాది మంది మలేరియా తదితర విష జ్వరాల బారిన పడుతుంటారు. వీరికి సరైన వైద్యం అందదు. ఊరిలోని ఆశా వర్కర్లు మంచి సేవలు అందిస్తున్నారని గ్రామస్తులు చెప్పారు. అయితే తీవ్రమైన వ్యాధులు సోకి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రజలకు నరకయాతనే.
ఈ గ్రామాల నుంచి వలసలు కూడా చాలా ఎక్కువ. ప్రక్క పంచాయితీ లోని అప్పల నాయుడు అనే ఏజెంట్‌ భార్యాభర్తలకు కలిపి రూ. 20 వేల చొప్పున ఇచ్చి సుమారు 200 మందిని చుట్టుపక్కల గ్రామాల నుంచి గుంటూరు జిల్లా తెనాలి దగ్గరలోని కల్లూరు ప్రాంతాలకు ఇటుక, రాయి పని కోసం తీసుకెళ్ళాడు. 5 నెలలు పని చేయించుకున్నారు. అడ్వాన్సు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇళ్లకు పంపారు. కృష్ణా జిల్లా లోని కోలవెన్ను దగ్గర గీతికా ఇండిస్టియల్‌ కోడిగుడ్ల అట్టల ఫ్యాక్టరీకి 2020 డిసెంబర్‌ నుంచి 2021 అక్టోబర్‌ వరకు 20 మందితో సుమారు 10 నెలలు పనులు చేయించుకున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.పది వేలు ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టారు. జీతాలు ఇప్పించడానికి సిపిఎం ఆందోళనలు చేపట్టింది.
రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నది. ఇందులో గిరిజన ప్రాంతం లోని నిరుపేద గిరిజనులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మర్రివలస గ్రామంలోని దమ్మి రామన్నదొర రూ.20 వేలు అప్పుజేసి ఇల్లు కట్టాడు. బొడ్డవార (విజయనగరం జిల్లా) షావుకారు నుంచి నూటికి సంవత్సరానికి రూ.25 చొప్పున వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నారు. మేకలు అమ్మి వడ్డీ తీర్చబోతున్నట్లు రామన్నదొర చెప్పాడు. ఈ ప్రాంతం లోని ప్రజలు భూమి సాగు చేస్తే తమకు ఎకరాకు ఆరు లేదా ఏడు బస్తాలు మాత్రమే పండుతాయని మేకల గంగులు చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కేజీల బియ్యం ఆపివేయడంతో అర్ధాకలితో జీవిస్తున్నామని గిరిజనులు వాపోయారు. వేలిముద్రలు పడలేదని పెంటమ్మ, మరకమ్మ, చిన్నాలమ్మకు రేషన్‌ ఇవ్వడం మానివేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం భాషా వాలంటీర్లకు జీతాలు ఎత్తివేయడంతో ఊరిలోని స్కూల్‌ మూతపడింది. అంగన్వాడీ సెంటర్‌లో మాత్రమే 23 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఈ గ్రామాలన్నింటిలోను సింగిల్‌ లైన్‌ విద్యుత్‌ తీగ మాత్రమే వుంది. రాత్రిపూట కరెంట్‌ వచ్చిపోతున్నట్లుగా వుంటుంది. గిరిజనుల సాగులో ఉన్న భూములకు నేటికీ పట్టాలివ్వలేదు. పట్టాలు లేవనే పేరుతో రైతు భరోసా డబ్బులు పడడంలేదని, ప్రభుత్వం ప్రకటించే స్కీముల వల్ల తమకు ఏమీ లాభం లేదని అనేక మంది గిరిజన రైతులు వెల్లడించారు.
ఈ ప్రాంత ప్రజల సమస్యలపై సిపిఎం దృష్టి పెట్టి పనిచేస్తున్నది. ఇటీవలే దాసరిపేట నుంచి జీలుగులుపాడు రోడ్డుకు సిపిఎం పోరాటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్ల నిధులు మంజూరు చేసిందని ప్రజలు చెప్పారు. గిరిజనులంతా ఐక్యంగా తమ సమస్యల పరిష్కారానికి పోరాడాలని సిపిఎం నాయకులు ప్రచారంలో పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి పోరాటమొక్కటే మార్గమని, రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని చైతన్యపరిచారు. మర్రివలస, పిసిని గ్రామాల ప్రజలు ఇంటింటి నుంచి విరాళాలు సేకరించి పార్టీ నిధికి రూ.12 వేలు వసూలు చేసి నాయకులకు అందజేశారు. పార్టీ నాయకులు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్ర సందర్భంగా వచ్చిన సమస్యలన్నింటిపై సిపిఎం నాయకత్వం జులై 1వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ను కలవాలని నిర్ణయించారు.

chnr

 

 

 

 

 

 

 

వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌. నరసింగరావు