Oct 02,2023 22:32
  •  సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు

ప్రజాశక్తి-గుడ్లూరు (నెల్లూరు) : రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు డిమాండ్‌ చేశారు. తీరంలో నిర్మిస్తోన్న ఓడరేవులకు రూ. వేల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి, పోర్టు పూర్తయ్యాక అదానికి అప్పగించడానికి పాలకవర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కొనసాగుతున్న సిపిఎం పాదయాత్ర సోమవారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రను నర్సింగరావు ప్రారంభించారు. తొలుత సిపిఎం బృందం పోర్టు ప్రాంతాన్ని సందర్శించింది. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించింది. అనంతరం చేవూరు గ్రామంలో నిర్వహించిన సభనుద్దేశించి నర్సింగరావు మాట్లాడారు. రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోర్టుకు అనుబంధంగా నిర్మించాలనుకుంటున్న పరిశ్రమలకు ఇప్పటికే ఉన్న భూములు సరిపోతాయని, చేవూరు గ్రామస్తుల భూములు లాక్కోవాలని చూస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ల్యాండ్‌ ఫూలింగ్‌ పేరుతో రైతులను పాలకవర్గాలు దగా చేస్తున్నాయని దుయ్యబట్టారు. భారతదేశంలో నిర్మించిన పోర్టులన్నీ అదాని, అంబానీకి ధారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం పలువురు ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలు కేంద్రాన్ని కదిలించడంతో భూములు కోల్పోయిన రైతులు, కార్మికులు, కర్షకులు కొంతవరకైనా తమ హక్కులు సాధించుకున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన తీరు సరికాదన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడి ఉంటే విచారణ జరిపి తగిన చర్య తీసుకోవాలని పేర్కొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడుతూ. ఉపాధిహమీ చట్టం కింద కనీసం 200 రోజులు పని కల్పించి, రోజుకూ రూ.600 వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, గోపాల్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్‌కె మస్తాన్‌బీ, జిల్లా నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.