
- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ సిహెచ్.నర్సింగరావు
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు సక్రమంగా దిగుమతులు అందజేసినట్లు అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం పేర్కొనడం అబద్ధమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్.నర్సింగరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్ ద్వారానే గంగవరం పోర్టుకు అత్యధిక లాభాలు వస్తున్నాయని తెలిపారు. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం చేసిన తప్పుడు ప్రకటన నేపథ్యంలో జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ చెల్లింపులు ఆలస్యమైనప్పటికీ స్టీల్‌ప్లాంట్‌కు సక్రమంగా దిగుమతులు అందించామని, ఈ నెల 5న పోర్టు యాజమాన్యం చేసిన ప్రకటన అవాస్తవమని పేర్కొన్నారు. అదానీ గ్రూప్ యాజమాన్యానికి, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణపై శ్రద్ధ లేదని ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గంగవరం పోర్టుకు గత నెల 16 నుంచి 18వ తేదీ వరకూ రూ.వెయ్యి కోట్ల విలువైన కొకింగ్ కోల్ విదేశాలు నుంచి షిప్‌ల ద్వారా రాగా సముద్రంలోనే పోర్టు యాజమాన్యం ఆపివేసిందన్నారు. గంగవరం పోర్టు గోడ దాటగానే స్టీల్‌ప్లాంట్ ఉన్నా అదానీ యాజమాన్యం ప్రతి ఏటా ఐదు శాతం చొప్పున ఛార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వ పలుకుడితో విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి వసూళ్లు చేసుకుంటోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్లాంట్‌పై మోపిన అదనపు భారాన్ని తగ్గించాలని, పాత టారిఫ్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన ఫోస్కో కంపెనీ, అదానీ గ్రూప్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను 2017 నుంచీ ప్రారంభించాయన్న దానికి ఆధారాలు ఉన్నాయన్నారు. గంగవరం పోర్టును అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకున్న తరువాత తమ ప్రయత్నాలను మరింత ముమ్మురం చేసిందని తెలిపారు. అధికారులు రిటైరైనా కొత్తగా ఒక్కరినీ ఉద్యోగంలోకి తీసుకోలేదన్నారు. మరోవైపున రూ.1800 కోట్లతో రైల్‌వీల్ ప్లాంట్ పెట్టి, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ కొనుగోలు పేరుతో సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి ఒక్క టన్ను కూడా నేటికీ విశాఖ స్టీల్‌కు రానీయకుండా చేసి ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరిచిందని విమర్శించారు. ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఎం.శ్రీనివాసరావు, ఆర్‌కెఎస్‌వి కుమార్ పాల్గొన్నారు.