
- 7న కలెక్టరేట్ల ముట్టడి
- ఫెర్రో ఎల్లాయీస్ రాష్ట్ర సదస్సులో తీర్మానం
- ఉద్ధేశ పూర్వకంగానే విద్యుత్ ఛార్జీల పెంపు : సిహెచ్ నర్సింగరావు
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల పరిరక్షణకు ఆగస్టు చివరి వారంలో చలో అసెంబ్లీ నిర్వహించాలని, ఈలోపు దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేయాలని ఎపి స్టేట్ ఫెర్రో ఎల్లయీస్ వర్కర్స్ కో ఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 7న కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు చేపట్టాలని సంకల్పించింది. విజయనగరంలోని రెవెన్యూ హోంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్ అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఫెర్రో ఎల్లాయీస్‌పై ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని సదస్సు హెచ్చరించింది. చలో విజయవాడ, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, కంపెనీల ఎదుట నిరసన దీక్షలు తదితర ఉద్యమ కార్యాచరణపై సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టివి రమణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనికి ముందుకు సదస్సులో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 36 ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు ఉండగా, ఒక్క విజయనగరంలోనే 21 పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. వీటిపై ప్రత్యక్షంగా 60 వేలు, పరోక్షంగా 6 లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని వివరించారు. ఉత్పత్తిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల విద్యుత్ భారంతో పరిశ్రమలు చాలా కాలంగా ఆర్థిక ఒడిదొడుకుల మధ్య నడుస్తున్నాయని వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలకు విద్యుత్ రాయితీలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఛార్జీలను పెంచడం వల్ల భారం తట్టుకోలేని యాజమాన్యాలు మూసివేతకు సిద్ధమౌతున్నాయని తెలిపారు. మార్చి 31 వరకు ఒక యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.4.95 ఉండగా, ఏప్రిల్ 1 నుంచి ఒక యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.8.55లకు ప్రభుత్వం పెంచిందన్నారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రం దాని అమలుకు పూనుకుందని తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల ఇప్పటికే విజయనగరం జిల్లాలో బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో 5, గరివిడి ప్రాంతంలో 3, కొత్తవలస ప్రాంతంలో ఒకటి ఇప్పటికే మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గరివిడి ఫేకర్ సహా మరికొన్ని పరిశ్రమల్లో ఉత్పత్తిని తగ్గించారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలను కాపాడాల్సిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ 'లాభాలు వచ్చినప్పుడు ఎవరికైనా ఇచ్చారా?' అంటూ యాజమాన్యాలను ఎగతాళి చేయడం బాధ్యతా రాహిత్యమన్నారు. చిత్తశుద్ధి ఉంటే యాజమాన్యాలకు నిర్థిష్టమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ ఫెర్రో పరిశ్రమలు మూతపడితే ఒక్క విజయనగరం జిల్లా లోనే ప్రత్యక్షంగా 15 వేల మందికి ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశ్రమకు పెంచిన విద్యుత్ చార్జీల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వాన్ని రోడ్డుపైకి లాగేందుకు కార్మికులంతా సిద్ధం కావాలని అన్నారు. సదస్సులో సిఐటియు నాయకులు ఎ.గౌరినాయుడు, అనకాపల్లి జిల్లా సిఐటియు నాయకులు ఆర్.రాము, గరివిడి, కొత్తవలస బొబ్బిలి, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఫెర్రో ఎల్లాయీస్ కార్మికులు మాట్లాడారు.