
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ జిల్లా సిపిఎం సీనియర్ నాయకులు, ప్రముఖ ఆర్టిస్ట్ పావెల్ ఆదర్శమూర్తి అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్ నరసింగరావు కొనియాడారు. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో ఉన్న జిల్లా కార్యాలయంలో పావెల్ మూడో వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగరావుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం పావెల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పావెల్ కమ్యూనిస్టు విలువకు కట్టబడి నిబద్ధతో పనిచేశారన్నారు. ఆయన ఆర్టిస్ట్‌గా పార్టీ అఖిలభారత మహాసభలు, రాష్ట్ర మహాసభలు ఎక్కడ జరిగినా అక్కడ వెళ్ళి అనేక సేవలందించారన్నారు. ఆయనకున్న సమర్ధతకు ఎన్నో అవకాశాలు వచ్చాయని వాటిని వదులుకొని పార్టీకి ఎనలేని సేవ చేశారన్నారు. పార్టీ చేపట్టే అనేక ఉద్యమాలకు బ్యానర్లు తయారుచేయడం, గోడివాతలు వ్రాయడం వంటివాటిలో కీలకపాత్ర పోషించేవారన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విధానాలపై జరిగే పోరాటాల్లో ముందుండేవారన్నారు. ఆయన అనేక మందికి శిక్షణ ఇచ్చి ఆర్టిస్ట్‌లుగా తయారు చేసి ఉపాధిని కల్పించారన్నారు. ఆయన మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరనిలోటున్నారు. ఈ సభకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు అధ్యక్షత వహించారు. పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, కుమార్, పద్మ, ఈశ్వరమ్మ, కెఎం శ్రీనివాస్, జగన్, సీనియర్ నాయకులు చలపతి, జ్యోతీశ్వరరావు, కుమార్‌మంగళం, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.