
- నాలుగేళ్లుగా తోటల నిర్వహణకు అందని ప్రోత్సాహకాలు
- ఆర్థిక స్థోమత లేక ఇబ్బందుల్లో
- 50 వేల మంది
ప్రజాశక్తి- పాడేరు : ఏజెన్సీలో ఐటిడిఎ ద్వారా కాఫీ తోటల పెంపకం చేపడుతున్న గిరిజన రైతులకు నాలుగేళ్లుగా ప్రభుత్వం ప్రోత్సాహక సొమ్ము చెల్లించడం లేదు. దీంతో, గిరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2020 నుంచి మూడేళ్లు వరుసగా ఏడాదికి 12 వేల ఎకరాల చొప్పున, ఈ ఏడాది 16 వేల ఎకరాల్లో ఐటిడిఎ ద్వారా కాఫీ తోటల పెంపకం చేపట్టారు. సుమారు 50 వేల మంది గిరిజన రైతులు తోటల సాగులో శ్రమించారు. వీరికి ఐటిడిఎ ద్వారా కాఫీ మొక్కలు మాత్రమే అందాయి. ఆ తరువాత ఎటువంటి సాయమూ దక్కలేదు. నర్సరీల నుంచి కాఫీ మొక్కలను కొండలపైకి చేర వేయడానికి రవాణా ఖర్చులు, గోతులు తవ్వి మొక్కలు నాటడానికి వీడింగ్ పనులు, తోటల నిర్వహణ పనులు నిమిత్తం ఎటువంటి ప్రోత్సాహకాలూ వీరికి అందలేదు. కాఫీ తోటల పెంపకానికి ప్రోత్సాహకాల కింద సుమారు రూ.54 కోట్లు చెల్లింపులు జరగాల్సి ఉందని కాఫీ రైతులు చెబు తున్నారు. గతంలో ఎకరాకు రూ.14 వేలు నుంచి రూ.18 వేలు వరకూ ప్రోత్సాహకాల కింద ఇచ్చే సొమ్మును నాలుగేళ్లుగా వైసిపి ప్రభుత్వం ఇవ్వలేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- నిర్లక్ష్యపు నీడ
'మన్యం కాఫీ'పై ప్రస్తుతం నిర్లక్ష్యపు నీడ అలుముకుంది. ప్రస్తుతం అమలవుతున్న కాఫీ ప్రాజెక్ట్ కొనసాగింపు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఆర్‌ఒఎఫ్ ద్వారా పంపిణీ చేసిన కొండపోడు భూముల్లో కాఫీ సాగు చేపట్టడానికి గిరిజన రైతులు సిద్ధంగా ఉన్నారు. పాడేరు ఏజెన్సీలో సుమారు లక్ష ఎకరాల విస్తీర్ణంలో కాఫీ సాగుకు అవకాశం ఉంది. అయితే, కాఫీ సాగు పట్ల పాలకుల అలక్ష్యం వల్ల గిరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర లభించడం లేదు. శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. పాడేరు, అరకులోయ, జి.మాడుగుల మండలాల్లో కొత్తగా ఐటిడిఎ ద్వారా కాఫీ సాగు చేపట్టిన గిరిజన రైతులను 'ప్రజాశక్తి' కలిసినప్పుడు వారి మనోవేదనను వివరించారు. 'నాలుగేళ్లుగా కేవలం మొక్కలు, ప్లాస్టిక్ సంచులు మాత్రమే ఇస్తున్నారు. నర్సరీల నుంచి కొండలపైకి మొక్కలను మోసుకెళ్తున్నాం.
వాటిని నాటడానికి ఒక ఎకరాలో అడుగున్నర లోతులో వెయ్యి గుంతలు తవ్వుతున్నాం. అంతకుముందు జంగిల్ క్లియరెన్స్ చేసుకోవడం, తోట చుట్టూ కంచె కట్టడం వంటి పనులు చేపడుతున్నాం. కాఫీకి రేటు వచ్చేంత వరకూ నాలుగేళ్లు శ్రమించాల్సి వస్తోంది. కాఫీ మొక్క నాటడానికి ఒక గొయ్యి తీసేందుకు రూ.15 ఇస్తున్నాం. వాటిని పెంచేందుకు చాలా వ్యయప్రయాసలు అనుభవిస్తున్నాం. అయినప్పటికీ కాఫీకి గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇతర పనులు చేసుకుని బతకడం మేలు అనిపిస్తోంది. ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వకపోవడం దారుణం. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి' అని ఆయా ప్రాంతాల్లోని రైతులు పేర్కొన్నారు. 'కాఫీ తోటల్లో చోరీలు, అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. తోటల వద్ద కాపలా పెట్టుకుందామన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు' అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రోత్సాహకాలకు
- నిధులు మంజూరు కాలేదు
ఏజెన్సీలో ఐటిడిఎ తోడ్పాటుతో కాఫీ సాగు చేస్తోన్న రైతులకు ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదు. గతంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా కాఫీ తోటల సాగు చేపట్టినప్పుడు అన్ని పనులకూ సొమ్ము చెల్లించేవారు. ప్రస్తుతం ప్రోత్సాహకాల సొమ్ము కోసం కాఫీ రైతులు చేస్తున్న వినతుల మేరకు జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఒల సూచనలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
-వెంకటేశ్వరరావు,
ఎపిఒ, పాడేరు ఐటిడిఎ