Aug 21,2023 22:01

కోపెన్‌హాగెన్‌(డెన్మార్క్‌): ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. సోమవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో హెచ్‌ఎస్‌ ప్రణయ్, లక్ష్యసేన్‌ ప్రత్యర్థులపై గెలిచి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న ప్రణయ్ 24-22, 21-10తో ఫిన్లాండ్‌కు చెందిన కలె కొల్జెనన్‌పై వరుససెట్లలో నెగ్గాడు. దీంతో ముఖాముఖి రికార్డునూ 3-0కు పెంచుకున్నాడు. మరో పోటీలో లక్ష్యసేన్‌ 21-12, 21-7తో జూలియన్‌ పాల్‌(మారిషస్‌)పై సునాయాసంగా విజయం సాధించాడు. ఇక నిరుడు కాంస్య పతకంతో సత్తా చాటిన భారత పురుషుల డబుల్స్‌ జోడీ ఈసారి స్వర్ణ పతకంపై కన్నేసింది. ఇప్పటివరకు మొత్తం 13 పతకాలు సాధించిన భారత్‌.. 1983లో ప్రకాశ్‌ పదుకొనే కాంస్య పతకం సాధించడంతో పతకాల వేటను మొదలుపెట్టింది. మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో పివి సింధుకు బై లభించగా.. రెండోరౌండ్‌లో వియత్నాంకు చెందిన లిన్‌-నుయెన్‌/నవోమీ ఒకుహరా(జపాన్‌)తో తలపడనుంది.