- అదాని షేర్లకు ఇపిఎఫ్‌ఒ రక్ష.. క్లిష్ట సమయంలోనూ పెట్టుబడుల కొనసాగింపు
న్యూఢిల్లీ : తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్న అదాని గ్రూపు కంపెనీలకు ఉద్యోగ, కార్మికుల సొమ్మును పణంగా పెడుతున్నారు. అదాని కంపెనీలు తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయని అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత ఆ కంపెనీల షేర్లు తీవ్ర పతనాన్ని చవి చూస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో అదానీని కాపాడటానికి ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్‌ఒ) ఉద్యోగుల సొమ్మును వాడుతోంది. దాదాపుగా 27.73 కోట్ల మంది ప్రయివేటు, ప్రభుత్వ రంగ ఉద్యోగ, కార్మికుల సొమ్ము ఇందులో ఉంది. హిండెన్‌బర్గ్ దెబ్బతో అనేక పెద్ద ఇన్వెస్టర్లు అదానీ కంపెనీల్లో పెట్టుబడులకు వెనుకాడుతుండగా.. మరోవైపు ఇపిఎఫ్‌ఒ మాత్రం అదాని ఎంటర్‌ప్రైజెస్, అదాని పోర్ట్స్ అండ్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎపిసెజ్)లో పెట్టుబడులను కొనసాగిస్తోంది. ఇపిఎఫ్‌ఒలోని 15 శాతం కార్పస్ ఫండ్స్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పెట్టుబడులుగా పెడుతోంది. 2022 మార్చి నాటికి రూ.1.57 లక్ష కోట్ల నిధులను బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇల్లోని పలు సూచీల్లో ఇన్వెస్ట్ చేసింది. మరో రూ.8,000 కోట్లను 2022-23లో పెట్టుబడులుగా పెట్టింది.
అదాని గ్రూపు అక్రమాలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 24న రిపోర్టు చేసింది. అప్పటి నుంచి అదానీ కంపెనీల షేర్లు పేక మేడలా కూలిపోయి.. ఇప్పటికీ తీవ్ర ఒత్తిడిలోనే ఉన్నాయి. ఎల్‌ఐసి తర్వాత అదానీ కంపెనీల్లో అత్యధికంగా ఇపిఎఫ్‌ఒ ట్రస్టీ పెట్టుబడులే ఉన్నాయి. అదానీ స్టాక్స్ 50 శాతం మేర క్షీణించాయి. ఈ సూచీల్లో పెట్టుబడులపై పెద్ద ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ మదుపర్లు ఆచీతూచీ వ్యవహారిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇపిఎఫ్‌ఒ మరిన్ని పెట్టుబడులకు సిద్దం అవుతోందనే రిపోర్టులు ఉద్యోగ, కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదాని స్టాక్స్‌ల్లో ఇపిఎఫ్‌ఒ పెట్టుబడులపై సెంట్రల్ ప్రావిడెండ్ ఫండ్ కమిషనర్ నీలమ్ శామి రావును ది హింద్ పత్రిక మార్చి 23న వివరణ కోరగా ఆయన స్పందించలేదు.
అదాని స్టాక్స్‌ల్లో తక్కువ పెట్టుబడులే ఉన్నప్పటికీ.. ట్రస్టీ రాబడిని దెబ్బతీస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. కాగా.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగే రెండు రోజుల బోర్డు సమావేశంలో ఈ అంశం తెరపైకి రావొచ్చన్నారు. అదాని షేర్లలో భారీ క్షీణత వల్ల రిటర్న్‌లు తగ్గొచ్చు. దీంతో పిఎఫ్ సభ్యులకు చెల్లించే వార్షిక వడ్డీ రేటులో కోత విధించే అవకాశం ఉంది. మార్చి 24 నుంచి ఇప్పటి వరకు అదాని ఎంటర్‌ప్రైజెస్ షేర్ 49 శాతం, ఎపిసెజ్ స్టాక్స్ 19 శాతం పతనమయ్యింది. సోమవారం సెషన్‌లోనూ బిఎస్‌ఇలో అదాని ఎంటర్‌ప్రైజెస్ షేర్ 1 శాతం పతనమై రూ.1,723కు దిగజారింది. ఇంట్రాడేలో 1,682 కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఎపిసెజ్ షేర్ 1.43 శాతం నష్టపోయి 629 వద్ద ముగిసింది.










