Aug 01,2023 18:33
  • అధికారుల అడ్డగింత
  •  కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట
  • మున్సిపల్‌ కార్మికుల అరెస్టు-విడుదల

ప్రజాశక్తి-సత్తెనపల్లి : మున్సిపల్‌ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం సత్తెనపల్లి మున్సిపల్‌ కార్యాలయాన్ని మున్సిపల్‌ కార్మికులు ముట్టడించారు. కార్మికులు విధులను బహిష్కరించి మున్సిపల్‌ కార్యాలయం మెయిన్‌ గేటు వద్ద బయట వేయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ధరణికోట విమల సిఐటియు పట్టణ నాయకులు జగన్నాధ రావు జడ రాజకుమారులు పాల్గొని మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిశీలించాలని చేస్తున్న పోరాటానికి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ పలనాడు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకళ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 26 వేల రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్‌ ఉద్యోగులు కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, పట్టణ విస్తరణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, కార్మికులకు పనిముట్లు రక్షణ పరికరాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.ఇంతలో మున్సిపల్‌ కార్యాలయం అధికారులు విధులకు హాజరయ్యేందుకు రావడంతో కార్మికులు వారిని కార్యాలయంలోకి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పట్టణ సీఐ యు శోభన్‌ బాబు పోలీసు సిబ్బందితో హుటాహుటిన మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సిఐటియు నాయకులు , యూనియన్‌ నాయకులతో సీఐ శోభన్‌ బాబు చర్చలు జరిపి ఆందోళనను విరమించాలని కోరారు.దీంతో కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కారం అయ్యేవరకు ఆందోళనను విరమించేది లేదని తేల్చి చెప్పారు.

muncipal dharna

కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు యూనియన్‌ నాయకులకు మధ్య వాదపువాదాలు జరిగాయి. అనంతరం పోలీసులు సిఐటియు నాయకులు జడ రాజకుమార్‌, యూనియన్‌ అధ్యక్షులు చింతగుంట్ల పెద్ద వెంకయ్య, దాసరి చిన కొండా, పెదాల సాంబశివరావు, తుమ్మలకుంట రమేష్‌ లను పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళి అరెస్టు చేసి జీపులో ఎక్కించారు. అనంతరం మిగతా కార్మికులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. ఈ సందర్భంగా కార్మికులు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ముందు అరెస్ట్‌ చేసిన నాయకులను విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన కార్మికులను, నాయకులను వ్యక్తిగత పూచికత్తి పై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కట్ట శివ దుర్గారావు షేక్‌ సైదులు, యూనియన్‌ నాయకులు జింక నాగమణి, దాసరి కొండ తదితరులు పాల్గొన్నారు.

  • మున్సిపల్‌ కార్మికులు, సిఐటియు నాయకుల అరెస్టులు అక్రమ : సిపిఎం

తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులను, మద్దతుగా నిలిచిన సిఐటియు నాయకులను అరెస్టు చేయడం అక్రమమని సిపిఎం సత్తెనపల్లి పట్టణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం స్థానిక పుతుంబాక భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి విమల మాట్లాడుతూ.. గత నెలలో 21, 22 తేదీలలో మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యలను పరిష్కారం చేయాలని రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మున్సిపల్‌ కార్మికులు ముట్టడి కార్యక్రమం చేపట్టవలసి వచ్చిందని అన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని అరెస్టు చేయించడం అన్యాయమని ఈ అరెస్టులను సిపిఎం పట్టణ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కట్ట శివ దుర్గారావు, జడ రాజకుమార్‌, షేక్‌ సైదులు, గద్దె ఉమాశ్రీలు పాల్గొన్నారు.