అవ్వ, అమ్మ.. అక్కా, చెల్లి.. పట్టుమని పన్నెండేళ్లు నిండని పసిపిల్లలు.. అంతేనా..? చెవులు వినపడని, మాటలు రాని విభిన్న ప్రతిభావంతులు ఎర్రజెండాల నీడలో కదిలివస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. వందల కిలోమీటర్లు ఎర్రటి ఎండలో.. కాలినడకన ప్రయాణించి వస్తున్నారు. అలుపెరగని యాత్ర చేస్తున్న ఆ మహిళలు పోలవరం నిర్వాసితులు.. అడవిబిడ్డలు.. కాయకష్టం తెలిసినోళ్లు.. కష్టాన్నే నమ్ముకున్నోళ్లు.. కూలీనాలీ చేసేటోళ్లు.. వారంతా 13 రోజులుగా పోరుబాటన ముందుండి నడుస్తూ.. వడివడిగా అడుగులు వేస్తూ.. యాత్రలో అగ్రభాగంలో నిలిచి వస్తున్నారు.

నెలసరి స్రావంతో ఒళ్లు తూలిపోతున్నా.. జ్వరంతో కాళ్లు కదలనీయకపోయినా.. బొబ్బలెక్కిన కాళ్లు.. ఒక్క అడుగు ముందుకు వేయబోమన్నా.. వెనుదిరిగేది లేదని.. వెనుకంజ లేదని.. దృఢచిత్తంతో ముందుకు అడుగులేస్తున్నారు. మహిళలారా.. శ్రమైక శక్తులారా.. కదిలిరండి పోరుబాటకు.. కలిసిరండి ప్రతిన బూని.. అన్న పిలుపును స్వాగతించి, ఎర్రజెండాల రెపరెపల మధ్య వందలాదిగా నడిచివస్తున్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. మనసును ద్రవింపజేసే నిర్వాసిత గాథ ...

న్యాయం దక్కేవరకూ ...
'కళ్ల ముందే గూడు చెదిరిపోయింది.. చేతికొచ్చిన పంట నీట మునిగిపోయింది. వండుకున్న కూడు బిడ్డలకు కడుపునిండా పెట్టనైనా లేదు. ఈ లోపే వరద ముంచెత్తింది. ఉన్నఫలాన చేతికందిన సామాను పట్టుకుని అడవిలోకి పరుగులు పెట్టాం.. జోరువానలో ఒకటి, రెండు కాదు.. నెలల తరబడి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మూడు నెలలు పొలాలు నీటిలోనే మునిగిపోయాయి. ప్రభుత్వం పరిహారం అరకొరే. తాటిచెట్టు ఎత్తు నీరు పారిన మా గ్రామం లాంటివి ఏటపాక మండలంలో ఇంకా ఉన్నాయి. అయినా మాకు ఇంత వరకు సర్వే చేయలేదు. మా గోడు పట్టించుకుంటారనే ఈ యాత్ర చేస్తున్నాం. మా బాధలు, కష్టాలు ప్రభుత్వానికి చేరేవరకు మా పోరాటం ఆగదు' అంటూ గతేడాది ముంపు అనుభవాన్ని చెబుతున్న వీరమ్మ ఎటపాక మండలానికి చెందిన మహిళ. ఆ మండలం నుండి యాత్రలో 40 మంది వరకు పాల్గొంటున్నట్లు ఆమె చెప్పింది. రెండు వారాలకు పైబడి నడుస్తున్న ఆమె ఇంకా ఇలా చెబుతోంది.. 'కాళ్లు నొప్పులు పెడుతున్నాయి.. చిన్నపిల్లల కాళ్లు బొబ్బలెక్కాయి. అయినా మేం నడక ఆపలేదు. నాయకులు విశ్రాంతి తీసుకోమని ఎన్నోసార్లు చెప్పారు. అయినా న్యాయం దక్కేవరకు విశ్రమించేది లేదని వారితోనే నడుస్తున్నాం' అంటున్నప్పుడు ఆమె మాటల్లో భవిష్యత్తు గురించి బెంగ, సాధించాలన్న పట్టుదలా స్పష్టంగా కనిపించాయి.

కాళ్లు బొబ్బలెక్కినా ...
ఈ యాత్రలో 11 ఏళ్ల బాలిక రజినీ కూడా భాగమైంది. విఆర్ పురం మండలానికి చెందిన ఈ పాప మొదటిరోజు నుండి యాత్రలో పాల్గొంటోంది. అమ్మానాన్న కూలీ పనులకెళితే.. ఆ ఇంటి నుంచి పోరుబాటకు వచ్చింది. పెద్దవాళ్లతో పాటు తను కూడా ఉదయం నుంచి రాత్రి వరకు అలాగే నడుస్తోంది. 'కాళ్లు బొబ్బలెక్కి, వాసిపోయి, నిద్ర పట్టక రాత్రుళ్లు లేచి కూర్చొంటోందని.. నడవలేవులే ఇంటికెళ్లిపోమ్మని ఎన్నిసార్లు చెప్పినా ... 'మా ఇంటి నుండి నేనొక్కదాన్నే వచ్చాను.. ఇప్పుడు నేను వెళ్లిపోతే ఎలా.. వరదల్లో మా ఇల్లు కొట్టుకుపోయినప్పుడు నాకు చాలా భయమేసింది. అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండేందుకు నాయకులు ఈ యాత్ర చేస్తున్నారు. అందుకే అమ్మ చెప్పగానే నేను యాత్రలో నడిచేందుకు సిద్ధమయ్యాను. నొప్పులొచ్చినా వెనక్కి వెళ్లనని చెప్పినట్లు' తెలుగు మాట్లాడడం సరిగ్గా రాని ఆ పాప అన్న మాటలను తనతో పాటు కలసి ప్రయాణం చేస్తున్నవారు వివరించారు.

గ్రామం మొత్తం మునిగిపోయింది ..
ఉపాధ్యాయ శిక్షణ పొంది, కూలీ పనులకెళుతున్న దారమ్మ విఆర్ పురం వెంకన్నగూడెం గ్రామానికి చెందింది. 'మా గ్రామంలో 250 ఇళ్లు ఉన్నాయి. గతేడాది వరదల్లో మా గ్రామం మొత్తం మునిగిపోయింది. తాటిచెట్లు కూడా కనబడలేదు. అయినా మా ఊరు ముంపు ప్రాంతంలో లేదని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థికంగా చాలా నష్టపోయాం. ఏ సాయం అందలేదు. అందుకే యాత్ర చేస్తున్నాం. నాయకుల పిలుపు రాగానే మా గ్రామం నుంచి 20 మందిమి యాత్రలో భాగమయ్యాం' అంటున్నప్పుడు ఆమె మాటల్లో భవిష్యత్తుపై దిగులు కనిపిస్తోంది.

బిడ్డను అమ్మకు అప్పగించి ...
కూనవరానికి చెందిన జ్యోతి తన ఆరేళ్ల పిల్లవాడిని వృద్ధురాలైన తల్లి దగ్గర ఉంచి, యాత్రలో పాల్గొంటోంది. 'గతేడాది వరదల్లో పండిన పంట, ఇళ్లు కొట్టుకుపోయి గింజలు ఏమీ మిగల్లేదు. కొనుక్కొని తిన్నాం. కరువు పనులకెళ్లిన అరకొర డబ్బులతోనే జీవనం సాగించాం. గోదారి, శబరి మధ్య డెల్టాలో మా ఊరు ఉండడం వల్ల పాడైన ఇళ్లు బాగుచేసుకోవడానికి రూ.60 వేలు, రూ.70 వేలు ఖర్చయితే రూ.10 వేలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మా దగ్గరికి రాలేదు. ఏవో సాకులు చెప్పి ఆ సాయం కూడా అందకుండా చేశారు. మాకు వరదలు కొత్త కాదు.. అప్పట్లో రెండు, మూడు రోజుల్లోనే తేరుకునేవాళ్లం. కానీ ఇప్పుడలా లేదు. గతేడాది వచ్చిన వరదలకు మూడు వారాలు డేరాలు కట్టుకుని అడవిలో ఉన్నాం. జోరువానలో పిల్లజెల్లాతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం' అంటూ ఎంతో ఆవేదనగా చెబుతోన్న ఆమె పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన పునరావాసాల గురించి కూడా కలత చెందుతోంది. 'మా మండలంలో ఒక గ్రామానికి ప్యాకేజీ కింద పునరావాసం ఇచ్చారు. అక్కడ నీళ్లు లేవు. కరెంటు లేదు. రోడ్లు లేవు. మాది నాణ్యమైన భూమి.. కానీ, ఇక్కడ రాళ్ల గుట్టలు ఉన్న నేల ఇచ్చారు. అది చూసి ఆ ఊరోళ్లు గుండెలు బాదుకున్నారు. మా గోడు ఎవరు పట్టించుకుంటారు? యాత్రలో భాగంగా పునరావాస కాలనీలకు వెళుతున్నాం. అవి చూస్తున్నప్పుడు మాకు భయం వేస్తోంది. రేపు మా పరిస్థితి కూడా ఇదేనన్న బెంగ పట్టుకుంది. ఇన్ని బాధలు చూసిన, అనుభవించిన మేమంతా న్యాయం కోసం పోరుబాటలో భాగస్వామ్యమయ్యాం. ఆరోగ్యసమస్యలు వేధిస్తున్నా వెనక్కివెళ్లడం లేదు' అంటూ చెబుతోంది.

అనారోగ్యం ఉన్నా .. ముందడుగు
'వరదలొచ్చి ఇళ్లు, పొలాలు నీట మునిగి మూడు నెలలు అడవిలోనే ఉండిపోయాం. ఉత్త చేతులతో వెళ్లిపోయాం. వరదల వల్ల అంటురోగాలు ప్రబలాయి. వైద్యం అందలేదు. జ్వరాలతో ఇబ్బంది పడ్డాం. విష పురుగుల నుండి పిల్లలను రక్షించుకునేందుకు రాత్రుళ్లు నిద్ర కూడా పోయేవాళ్లం కాదు. ఈ యాత్ర ద్వారానైనా మా పరిస్థితిలో మార్పు వస్తుందన్న ఆశతో ఇన్ని వందల కిలోమీటర్లు నడుస్తున్నాం. నెలసరి సమస్యలతో మాలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. జ్వరాలు వస్తున్నాయి. అయినా వెనకడుగు వేయకుండా నడుస్తున్నాం' అంటున్న లక్ష్మి, చిన్న పిల్లలను వృద్ధురాలైన అత్తగారికి అప్పచెప్పి భర్తతో కలిసి యాత్ర చేస్తోంది.

అమ్మానాన్న లేని దేవికి చెవులు వినపడవు. మాటలు రావు. బంధువుల ఇంట్లో తలదాచుకుంటోంది. డిగ్రీ చదివింది. కాళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతున్నా వెనక్కి వెళ్లటానికి ఇష్టపడడం లేదు. పట్టుదలతో నడిచి, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని బలంగా కోరుకుంటోంది.
... ఇలా పోలవరం పోరుకేక నడక యాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్క మహిళా ఎంతో పట్టుదలతో ముందుకు నడుస్తోంది. పన్నెండేళ్ల బాలికల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకూ వందలాది మంది మహిళలు, పురుషులు ఈ యాత్రలో మున్ముందుకు సాగుతున్నారు. యాత్ర పిలుపు అందుకోగానే పెట్టే, బేడా సర్దుకుని సిద్ధమయ్యారు.
అడుగడుగునా ఆదరణ
తమ యాత్రకు ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి గొప్ప సంఘీభావం లభిస్తుందని యాత్రలో పాల్గొంటున్న మహిళలు ముక్తకంఠంతో చెబుతున్నారు. నాయకులు తమ పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని, ఎప్పటికప్పుడు తమ అవసరాలు కనిపెడుతూ.. చెప్పులు తెగిపోతే చెప్పులు ఇప్పించడం, గొడుగులు ఇవ్వడం, మంచినీటి సౌకర్యం, మజ్జిగ, ఆహారం, అవసరమైన మందులు సకాలంలో అందిస్తున్నారని తెలిపారు.
యాత్రలో పాల్గొంటున్న ఎర్రదండుకు అడుగడుగునా పుష్పగుచ్ఛాలు, పూలదండలతో ఆయా గ్రామాల్లో ఘన స్వాగతాలు పలుకుతున్నారు. వ్యక్తులుగా, సంఘాలుగా తరలివచ్చి యాత్రకు సంఘీభావంగా పూల రేకలతో పూలవాన కురిపిస్తున్నారు. ఎర్రని జెండాలు పట్టుకుని కదిలివస్తున్న ఎర్రదండు పాదయాత్రతో వీధులన్నీ అరుణమయం అవుతున్నాయి.

ఈ యాత్ర ఎందుకంటే ...
మైదాన ప్రాంతంలో ఎన్నో లక్షల ఎకరాలకు సంవృద్ధిగా నీరు అందించే, లక్షలాది ప్రజల భవితకు బంగారు బాట వేసే బహుళార్ధసాధక ప్రాజెక్టు పోలవరం. అది వందలాది ఆదివాసీ గ్రామాలు, సాగుభూములూ నీట మునిగితే, నిర్వాసితం అయిపోతే, అందే ఫలం. మరి ఊళ్లను, భూములను, ఇళ్లను త్యాగం చేసిన ఆదివాసీల పట్ల ప్రభుత్వాలు ఎంత బాధ్యతతో ఉండాలి? ఎంత దన్నుగా నిలవాలి? ఎంత ధైర్యాన్నివాలి? కానీ, అలా చేయటం లేదు. పోలవరం ప్రాజెక్టు గిరిజన బిడ్డల జీవితాల్లో ఎంతో విషాదాన్ని తెస్తోంది. ఉన్న ఊరిని, కట్టుకున్న ఇంటిని, నమ్ముకున్న భూమిని ప్రాజెక్టుకు అప్పజెప్పిన ఆ అడవిబిడ్డలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందడం లేదు. ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాసం కల్పిస్తామన్న మాటలు నీటిమూటలయ్యాయి. అరకొర పనులతో కల్పించిన వసతులు వారిని దుర్భర జీవితాల్లోకి నెట్టేస్తున్నాయి. తమ బతుకులు బాగుచేయండని, అన్యాయం చేయొద్దని ఏళ్ల తరబడి వేడుకుంటున్నా పాలకులు వారి గోడు వినిపించుకోవడం లేదు.. అందుకే ఎన్నాళ్లీ నిర్లక్ష్యం.. ఎంతకాలమీ అగచాట్లూ అంటూ పోరుబాట పట్టారు ఆ గిరిజనం.
- జ్యోతిర్మయి










