- ఫ్యాక్టరీల్లో రెండు దశాబ్దాలుగా 19 శాతం కంటే పెరగని మహిళలు
- కేరళ, తమిళనాడు, కర్నాటక, ఏపీల్లో 72 శాతం మంది
- వేతనాల్లోనూ విస్తృత అంతరాలు : ఎఎస్‌ఐ సమాచారం
దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ వివక్షకు గురవుతున్నారు. విద్యలోనే కాకుండా ఉపాధిలోనూ పురుషులతో పోల్చుకుంటే చాలా వెనుకబడిపోయారు. భారత్‌లోని ఫ్యాక్టరీలలో ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఇందులో పని చేసే మహిళల సంఖ్య ఐదో వంతు కంటే తక్కువగా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఏపీలలో మాత్రం ఇది 72 శాతంతో పర్వాలేదనిపించాయి. ఇటు పనికి దక్కే వేతనాల్లోనూ విస్తృత అంతరాలు కనిపించాయి. పరిశ్రమల వార్షిక సర్వే (ఎఎస్‌ఐ) సమాచారంలో ఈ విషయం వెల్లడైంది.
న్యూఢిల్లీ : భారత్‌లోని పరిశ్రమ ల్లో లింగవివక్ష స్పష్టంగా కనిపిస్తున్నది. ఫ్యాక్టరీలలో పనిచేసే మహిళల సంఖ్య పురుషులతో పోల్చు కుంటే చాలా తక్కువగా ఉన్నది. గత రెండు దశాబ్దా లుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. పురుషులకు, మహిళలకు అందే వేతనాల్లోనూ ఈ తేడా అధికంగా ఉన్నది. పరిశ్రమల వార్షిక సర్వే (ఎఎస్‌ఐ) సమాచారం ఈ విషయాన్ని వెల్లడించింది. మహిళా సాధికారత అంటూ ఉపన్యాసాలు ఇచ్చే పాలకపక్ష రాజకీయ నాయకులు.. దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా వివక్షతను రూపుమాపలేకపోతున్నాయని సామా జిక కార్యకర్తలు, మహిళా సంఘాల నాయ కులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎఎస్‌ఐ సమాచారంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సమాచారం ప్రకారం.. 2019-20 ఏడాదిలో భారత్‌లోని సంఘటిత ఉత్పాదక పరిశ్రమల్లో 80 లక్షల మంది ఉపాధిని కలిగి ఉన్నారు. వీరిలో మహిళలు 16 లక్షల మంది (అంటే 19.7 శాతం) మాత్రమే కావడం గమ నార్హం. 1998 నుంచి గత రెండు దశాబ్దాలకు పైగా ఇదే గణాంకాలు కనబడుతున్నాయి.
ఈ 16 లక్షల మందిలో 6.8 లక్షల మంది (43 శాతం మంది) ఒక్క తమిళనాడు రాష్ట్రంలోని ఫ్యాక్టరీలలోనే ఉపాధి పొందటం గమనార్హం. భారత్‌లోని పరిశ్రమలలో గల మొత్తం మహిళా శ్రామిక శక్తిలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళ నాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనే 72 శాతం మంది ఉన్నారు. ఉత్పాదక రంగంలో శ్రామిక శక్తి లింగ సమతుల్యతను నమోదు చేసిన రాష్ట్రంగా మణిపూర్ ఉన్నది. ఇక్కడ 50.8 శాతం మంది మహిళలు శ్రామిక శక్తిలో ఉన్నారు. ఆ తర్వాతి రాష్ట్రాల్లో కేరళ (45.5 శాతం), కర్నాటక (41.8 శాతం), తమిళనాడు (40.4 శాతం) లు ఉన్నాయి.
ఇక ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లింగ అసమతుల్యతను అధికంగా కలిగి ఉన్నది. ఇక్కడ కేవలం 2.9 శాతం మంది మహిళలు ఉత్పాదక యూనిట్లలో పని చేస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (4.7 శాతం), జమ్ముకాశ్మీర్ (5.5శాతం), పశ్చిమ బెంగాల్ (5.5 శాతం) ఉన్నాయి. దేశంలో పారిశ్రా మికీకరణ అధికంగా కలిగి ఉన్న రాష్ట్రాల్లోనూ లింగ వివక్ష విస్తృతంగా ఉన్నది. మహారాష్ట్ర (12 శాతం), ఉత్తరప్రదేశ్ (5.7 శాతం), గుజరాత్ (6.8శాతం)లలో ఈ లింగ అంతరాలు ఎక్కువగా ఉన్నాయి.
- వేతనాలలో అంతరాలు
పురుషులు, మహిళా కార్మికుల మధ్య వేతనా ల్లోనూ అంతరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019-20 ఏడాది సమాచారం చూసుకుంటే.. ఒక పురుష కార్మికుడు రూ.100 సంపాదిస్తే.. మహిళా కార్మికురాలి సంపాదన మాత్రం రూ.87.06 గా ఉన్నది. ఒక్క రోజుకు పురుష కార్మికుడు సగటున రూ.439 ఆర్జించగా.. మహిళా కార్మికురాలు రూ. 382 మాత్రమే గడించగలిగింది. పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో ఈ అంతరాలు అధికంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో ఒక పురుషుడు రూ. 100 సంపాదిస్తే.. మహిళా కార్మికురాలు మాత్రం వరుసగా రూ. 74.1, రూ. 75.5, రూ. 78.4 మాత్రమే పొందగలగటం పరిశ్రమల్లో మహిళలు వివక్షకు గురవుతున్న విషయాన్ని వెల్లడిస్తున్నది.











