Nov 09,2023 22:20

ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌
బ్యాంకాక్‌: ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఒకేరోజు మూడు స్వర్ణ పతకాలు దక్కాయి. గురువారం జరిగిన కాంపౌండ్‌ మిక్స్‌డ్‌, మహిళల టీమ్‌ విభాగాలతోపాటు, వ్యక్తిగత విభాగంలో స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖను ఓడించి పర్నీత్‌ బంగారు పతకాన్ని ముద్దాడింది. అదితి స్వామి, పర్నీత్‌ కౌర్‌, వెన్నం జ్యోతి సురేఖలతో కూడిన మహిళా ఆర్చర్ల బృందం 234-233పాయింట్ల తేడాతో చైనీస్‌ తైపీకి చెందిన హి-హుసాన్‌, హంగ్‌ లీ, వాంగ్‌-లూలను చిత్తుచేసి భారత్‌కు మొదటి బంగారు పతకాన్ని ఖాయం చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పర్నీత్‌ కౌర్‌ 145-145పాయింట్లతో సమంగా నిలిచి.. షూట్‌ ఆఫ్‌లో 9-8పాయింట్ల తేడాతో జ్యోతి సురేఖపై సంచలన విజయం సాధించింది. ఇక మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ విభాగంలో అదితి స్వామి-ప్రియాన్షు జోడీ 156-151పాయింట్ల తేడాతో థారులాండ్‌ జోడీని చిత్తుచేసి భారత్‌కు మూడో స్వర్ణ పతకాన్ని ఖాయం చేశారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో అభిషేక్‌ వర్మ 147-146పాయింట్ల తేడాతో దక్షిణ కొరియాకు చెందిన జీ-జేహూన్‌ను చిత్తుచేసి కాంస్య పతకాన్ని చేజిక్కించుకోగా.. మహిళల రికర్వు, పురుషుల టీమ్‌ విభాగాల్లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు దక్కాయి. దీంతో ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు దక్కిన పతకాల సంఖ్య ఏడుకు చేరింది. ఇందులో మూడు స్వర్ణ, ఒక రజత, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.