May 13,2023 10:51

నేస్తాలు...! మా పేర్లు మంజు, చరణ్‌. మీకు కొన్ని విషయాలు చెబుదామని వచ్చాం. ప్రస్తుత కాలంలో ఓ విషయాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషులో చదవడం, రాయడం చాలా మంది విద్యార్థులకు భయం. ఇలాంటి వారిని ప్రోత్సహించి, వారిలో చదువుపై ఆసక్తి పెంచేలా ఓ యాప్‌ తయారుచేశాం. ఆ యాప్‌ పేరు 'మై ఏఐ టీచర్‌'. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో చదవడం, రాయడం సులభతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. రెండు సంవత్సరాలు కష్టపడి చేసి రూపొందించాం. మా గురువు డాక్టర్‌ సంగరాజు భాస్కర్‌రాజు ప్రోత్సాహంతో మేము ఈ యాప్‌ చేశాం. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
 

యాప్‌ వివరాలు
4వ తరగతి విద్యార్ధికి సంబంధించిన ఓ సబ్జెక్టులో పాఠ్యాంశాలు 128 పేజీలు ఉంటాయి. ఇందులో 12 వేల పదాలు ఉంటాయి. దీన్ని కుదించి, అనవసరమైనవి మాత్రమే ఉంచుతాం. మరల మరలా దొర్లినవి తీసివేసి, సరైన కొత్త రకపు పదాలను 1200 పదాలకు తీసుకురావడం, 20 పేజీలకు తయారు చేయడం ద్వారా పిల్లలు రోజుకు 50 పదాలు నేర్చుకున్నా... 25 రోజుల్లో పూర్తి సబ్జెక్టును పూర్తి చేయగలరు.

ఇందులో నాలుగు అంశాలు ఉంటాయి. 1.ఉన్నది ఉన్నట్లు చదవడం, 2.వత్తును తీసేసి చదవడం, 3.గుర్తుపట్టి రాయడం, చదవడం, 4.ఎలా రాస్తామో అలా చెప్పడం. ఇందులో ఒక పదానికి సంబంధించి పూర్తి అర్ధాన్ని తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలో చెప్పడం, చూపించడం జరుగుతుంది. ఏదైనా అనుమానం ఉన్న పదాన్ని తెలియజేస్తే, దానికి పూర్తి అర్ధం చెబుతుంది. ఇంగ్లీషు పేపర్‌ను ఫొటో తీసి యాప్‌లో ఉంచితే తెలుగులో అనువాదం అవుతుంది. ఏ భాషలో కావాలని అడిగితే- ఆ భాషలో చదివి వినిపిస్తుంది. ఇలా ఒక భాష నుంచి మరో భాషకు అనువాదం అవడం, చదివి వినిపించడం తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లోనూ ఉంటుంది.

ప్రస్తుతం ఈ యాప్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భాస్కర్‌రాజు కృషి చేస్తున్నారు. ఈ సెలవుల్లో ప్రతి ఆదివారం ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవొచ్చు.

11