Sep 04,2023 06:59

కొన్నాళ్లే ఉంటాయి
ఈ క్షణాలు
మిడిసిపడుతూ ఎగిరి పడుతూ విర్రవీగుతూ
ఈ అధికార కిరీటాలు ధగధగలాడుతూ
ఈ అహంకార భుజకీర్తులు వెలిగిపోతూ
ఏ చరిత్ర పుటలు ఏ కీర్తి చంద్రికలు
ఎంతవరకు తలదన్ని నడుస్తాయి
కాలాన్ని వీపున గట్టుకున్న సద్ది మూటలా సాగే కొద్ది భారమైపోయి
ఒక్కో గడియ కరిగి
ఒక్కో మెతుకు రాలి
కాళ్ళు విరిగిన పడవ
చూపు తెగిన చుక్కాని
తీరం తెలియదు
ఏ దిక్కు తానున్నట్టు ప్రకటించదు
మధ్యమధ్య రాకాసి అలలు
అలలు సంహరించే ఆయుధం లేదు చేతిలో
దగ్ధమవుతున్న అడవుల్లా
దుఃఖపు పెనుమంటలు
ఆవరించిన శ్మశానాల్లా
దొర్లి దొర్లి ఏడుస్తున్నాయి కాంక్షలు
ఒకటి దూరమై మరొకటి దగ్గర అయినట్టు
ఒక్కోసారి అన్ని దూరంగా జరిగిపోయినట్టు
ప్రపంచమంతా గుప్పెడు మట్టిగా మారి
ఊపిరి సొరంగాలను కప్పేసినట్టు
రాత్రులు గుడ్డి గుర్రాలుగా పరిగెడుతున్నాయి
నిశ్శబ్ద స్వప్నాలు
మహా విస్ఫోటనాలుగా వినిపిస్తున్నాయి
నిషిద్ధ వచనాలు సజీవ వాక్యాలుగా నిలిచిపోతున్నాయి
పయనమై సాగే పక్షుల గుంపులా
ముసురు కప్పుతున్న మబ్బుల్లా జీవితం
చీకటి పడుతుంది
అది శూన్యంలా ఉంటుంది
ఇక
ఎప్పటిలాగే తెల్లరుతుందా రేపు ఉదయం
వీధిలో కుక్క విశ్వాసంగానే తోక ఆడిస్తుందా
పిడస ముద్ద పెట్టినందుకు
కాలం విశ్వాస ఘాతకిగానే మిగులుతుందా
మరణం మరింత దగ్గరవుతున్నట్టు
కొత్తగాలి వీస్తుంది సమాధుల మీదుగా...
 

- లోసారి సుధాకర్‌
99499 469916