ట్రాన్స్ జెండర్లను సమాజం చాలా చిన్నచూపు చూస్తుంది. వారిపట్ల చూపే ఏహ్య భావం వారిలో న్యూనతాభావానికి లోనయ్యేలా చేస్తుంది. దాంతో ఎక్కువ మంది బిక్షాటన వైపు నడుస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కొంత మార్పు వస్తోంది. ఆత్మగౌరవంతో చదువుకొని, ఉన్నతస్థాయికి చేరుకుని గుర్తింపు సంపాదిస్తున్నారు. అటువంటి కోవకే చెందుతారు ఛవి. తనని చూసి అవమానించిన వారే ఇప్పుడు గౌరవిస్తున్నారు. చావు వరకూ వెళ్లిన ఆమె ధైర్యంగా వేసిన అడుగే తనని ఉన్నత అధికారుల చేత ప్రశంసలు అందుకునేలా చేసింది. ఛవి జీవితంలో సాధించిన విజయాన్ని తన మాటల్లో....

''మాది ఒడిశాలో ధెంకనల్ జిల్లాలోని బన్మాలి ప్రసాద్ గ్రామం. పేద కుటుంబం. అమ్మ, నాన్నలకు నేను ఒక్కదాన్ని. అబ్బాయినని బాగా చూసుకున్నారు. పదకొండేళ్ల వయస్సులో నా శరీరంలో మార్పులు మొదలయ్యాయి. నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. ఎవరికైనా చెప్పాలన్నా భయమేసింది. నాన్న నా ప్రవర్తన చూసి చీదరించుకునేవాడు. ఏడ్చేవాడిని. దాంతో అమ్మ నన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చేది. టీవీల్లో హీరోయిన్లను చూసి వారిలా కనిపించాలని మేకప్ వేసుకునేవాడిని. వారిలా డైలాగులు చెప్పేవాడిని. చీరకట్టుకుని, తోటి అమ్మాయిలతో కలిసి ఆడుకునేవాడిని. అది చూసి నాన్నకు బాగా కోపం వచ్చి కొట్టారు. బయటకు గెంటేసే పరిస్థితి వచ్చింది. కాని అమ్మ అడ్డుకుంది. అసలు నాలో ఏం జరుగుతుందో నాకే అర్థం అయ్యేది కాదు. పిచ్చిపట్టినట్లు అనిపించేది. నా మానసిక పరిస్థితి అమ్మ అర్థం చేసుకుని, అమ్మాయిల వస్త్రాలు తీసుకొచ్చి ఆడపిల్లలా నన్ను మార్చింది. అప్పుడు నాకు మా అమ్మ ఆశాకిరణంగా కనిపించింది.
అమ్మా, నాన్నల మరణం
కొంచెం పెద్దయ్యాక నా చుట్టూ ఉన్న జనం నన్ను ఎగతాళి చేయడం ప్రారంభించారు. నా కుటుంబాన్ని అవమానకరంగా మాట్లాడారు. దూషించారు. ఒక రకంగా వెలివేశారు. దాంతో అమ్మ తట్టుకోలేక పోయింది. గుండెపోటుతో మరణించింది. దాంతో నాన్న మరో పెళ్లి చేసుకున్నారు. ఆమె నన్ను ఇబ్బందులు పెట్టింది. భరించలేక ఏడ్చేదాన్ని. అది చూసి నాన్న బాధతో కుంగిపోయారు. రెండు సంవత్సరాలకు ఆయనా చనిపోయారు. ఇదే అదునుగా మారు తల్లి నన్ను ఇంట్లో నుంచి బయటకు నెట్టింది. ఎనిమిదో తరగతికే నా చదువు ఆగిపోయింది. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లా. అక్కడా పనివాళ్లు నన్ను పేరుతో పిలవకుండా అవమానకరంగా పిలిచి ఏడిపించేవాళ్లు. ఎందుకు బతుకుతున్నానో తెలియక ఏడ్చేదాన్ని. చుట్టూ ఉన్న వాళ్ల మాటలు భరించలేక చనిపోదాం అని నిర్ణయించుకుని దెంకనల్ రైల్వే స్టేషన్‌కి వచ్చా. కన్నీళ్లతో చూసిన ఓ తల్లి నా దగ్గరకు వచ్చింది. నా తల నిమిరి ఎందుకు ఏడుస్తున్నావు? అని మా అమ్మలా అడిగింది. నా పరిస్థితి అంతా చెప్పా. అప్పుడు ఆమె ' జీవితం అంటే ఇదేనమ్మా. ఏం జరిగినా స్వీకరించాలి. భయాలన్నీ వదిలిపెట్టి ధైర్యంగా ముందుకు నడవాలి. సమస్యలను ఎదుర్కొవాలి. చనిపోవాలనుకోవడం తప్పు. స్వయంగా నువ్వు స్వంత పని చేసుకొని బతుకు' అని చెప్పింది. ఆమె మాటలు కొండత బలాన్ని ఇచ్చాయి. ఎక్కడైతే అవమానాలు పడ్డానో... అక్కడికే తిరిగి వచ్చా.
స్వయం సహాయక బృందంతో ...
మునిసిపాలిటీల్లో చెత్తను సేకరించే కాంట్రాక్టు పని ఒప్పుకున్నా. వాటిలో ప్లాస్టిక్‌ను, వ్యర్థాలను వేరుచేసే పనిని 'బుద్ధి దేరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్' పేరుతో స్వయం సహాయక సంస్థను ప్రారంభించా. అందులో నాలాగే ఇబ్బందులు పడ్డ ఐదుగురు ట్రాన్స్‌జండర్లకు ఉపాధి కల్పించా. వారితో ఈ పని మొదలుపెట్టా. దాంతో కొన్నేళ్లకు మునిసిపాలిటీ నుంచి ఓ పెద్ద కాంట్రాక్టు వచ్చింది. ఆదాయమూ కనిపించింది. మేము చేస్తున్న ఈ కృషిని గుర్తించి ప్రభుత్వ అధికారులు ఇందులోనే ఉద్యోగ అవకాశం కల్పించారు. వ్యర్థ పదార్థాల శుద్ధి కర్మాగారం అయిన మహిసాపత్ వెల్త్ సెంటర్‌లో మాకు ఉద్యోగాలు లభించాయి. నా ప్లాంట్‌కు ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నా, వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రక్రియలను పర్యవేక్షిస్తూ వ్యర్థాలను సంపదగా మారుస్తా. కార్యాలయంలో మా అంకితభావం, సమన్వయం గుర్తించి అధికారులు ప్రశంసించారు. హెల్పింగ్ హ్యాండ్స్ సోషియో-స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ నుంచి, దెంకనల్‌లోని మోడల్ డిస్ట్రిక్ట్ డిసేబిలిటీ రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి అవార్డుతో సత్కరించారు.
ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నానో అక్కడ నుంచే అభివృద్ధి చెందడం మొదలుపెట్టా. చివరికి గెలిచా. అందరూ నా దగ్గరకు వచ్చి ఫొటోలు దిగుతుంటే ఎంతో గర్వంగా ఉంది. మాకు మామూలు మనుషుల్లాగే బతకాలని ఉంటుంది. కానీ, సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌మని దూరం పెడుతుంది. అసలు ఈ మార్పుకు తొలి అడుగు ఇంట్లోనే పడాలి. పిల్లలు తమ లైంగిక, జెండర్ అస్తిత్వాన్ని బయటపెట్టినప్పుడు మొదట భయపడినా, తరువాత అంగీకరించాలి. అక్కున చేర్చుకోవాలి. అప్పుడే మాలాంటి వారికి మానసికస్థైర్యం కలుగుతుంది'. అంటారు ఛలి.










