Sep 03,2023 21:43

ఆసియా కప్‌లో భాగంగా భారత్‌, నేపాల్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతుందా..? అనే అనుమానం క్రీడా అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే భారత్‌, నేపాల్‌ మ్యాచ్‌కూ 90 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం నుంచి అక్కడ వర్షం కురిసే ఛాన్స్‌ ఉంది. వర్షం ప్రభావంతో టాస్‌ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందట. మ్యాచ్‌ జరిగే సమయంలో జల్లులు ఆటకు అంతరాయం ఏర్పడే అవకాశముందని సమాచారం. ఇప్పటికే ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. నేపాల్‌ మ్యాచ్‌ కూడా రద్దయితే భారత్‌ పరిస్థితి ఏంటి? అని ఫాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.
వర్షం కారణంగా భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ రద్దు కావడంతో.. ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్‌ చేరింది. గ్రూప్‌-ఏలో నేపాల్‌పై విజయం సాదించిన పాకిస్థాన్‌.. టీమిండియా మ్యాచ్‌ రద్దు అవడంతో వచ్చిన ఒక పాయింట్‌తో కలిపి (3 పాయింట్స్‌) సూపర్‌-4కు దూసుకెళ్లింది. నేపాల్‌తో మ్యాచ్‌ జరిగి.. రోహిత్‌ సేన విజయం సాధిస్తే మూడు పాయింట్లతో భారత్‌ సూపర్‌-4కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వరుణుడి ఆటంకంతో భారత్‌, నేపాల్‌ మ్యాచ్‌ కూడా రద్దయితే.. రెండు పాయింట్లతో భారత్‌ సూపర్‌-4కు అర్హత సాధిస్తుంది. అప్పుడు నేపాల్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక సూపర్‌-4లో భాగంగా సెప్టెంబరు 10న భారత్‌, పాకిస్థాన్‌ మరోసారి తలపడతాయి.