- నీళ్లు ఇస్తామంటూ 15 ఏళ్లుగా ఊరింపు
- 38 శాతమే పనులు పూర్తి
- మూడున్నరేళ్లుగా నిలిచిపోయిన వైనం
- టెండర్ల దశలోనే మిగిలిన పనులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : ఆఫ్‌షోర్ పూర్తి చేసి నీళ్లు ఇస్తామంటూ 15 ఏళ్లుగా రైతులను ఊరించడమే తప్ప వాటిని పూర్తి చేయడంలో పాలకులు చిత్తశుద్ధి కనబరచడం లేదు. 2007లో వైఎస్ హయాంలో ప్రారంభమైన పనులు నేటికీ కొలిక్కి రాలేదు. టిడిపి ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలోనూ పనులను పూర్తి చేయలేకపోయింది. 2014-19 మధ్య కాలంలో 38 శాతం మాత్రమే పనులు జరిగాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ఒక్క శాతం పని కూడా కాలేదు. పనుల ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రభుత్వం, మిగిలిన పనుల కోసం సవరించిన అంచనాలతో పంపిన ప్రతిపాదనలను గతేడాది సెప్టెంబరు లోనే ఆమోదించినా నేటికీ టెండర్లు ఖరారు కాలేదు. దీంతో రిజర్వాయర్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
టెక్కలి, నందిగాం, పలాస, మెళియాపుట్టి మండలా ల్లోని 24,600 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఆఫ్‌షోర్ రిజర్వాయరు ప్రాజెక్టును ప్రారంభించింది. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌విఇసి-ఇందు సంస్థతో రూ.123.25 కోట్లతో ఫిబ్రవరి 18, 2007లో ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం 2008 జనవరి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. భూసేకరణ పనులు సకాలంలో కాకపోవడం, ప్రభుత్వం పెద్దగా దృష్టిసారించకపోవడంతో 2014 వరకు పనులు ప్రారంభం కాలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం, రిజర్వాయరు పనులను మళ్లీ అదే సంస్థకు అప్పగించింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరించి రూ.466.28 కోట్లకు పెంచింది. ప్రాజెక్టు పనుల పూర్తికి జులై 7, 2019 వరకు గడువు ఇచ్చింది. టిడిపి ప్రభుత్వం అధికారం కోల్పోయిన నాటికి 38 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత నిర్మాణ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. మిగిలిన పనులకు సంబంధించి కొత్త రేట్లతో రూ.850 కోట్ల అంచనా వ్యయంతో గతేడాది సెప్టెంబరులోనే అధికారులు ప్రతిపాదనలు పంపారు.
నిర్మాణ పనులు జరిగింది 38శాతమే
రిజర్వాయర్ పనులు ప్రస్తుతం 38 శాతం మేర జరిగాయి. మట్టి పనులు 83,31,000 క్యూబిక్ మీటర్ల పని చేపట్టాల్సి ఉండగా 42,36,527 క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. ఇంకా 40,94,473 క్యూబిక్ మీటర్ల పని మిగిలి ఉంది. కాంక్రీట్ పనులు 1,31,544 క్యూబిక్ మీటర్ల పని చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,457 క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. మరో 1,29,087 క్యూబిక్ మీటర్ల పని పెండింగ్‌లో ఉంది. మరోవైపు భూసేకరణ కూడా పెండింగ్‌లో ఉంది. రిజర్వాయరు కోసం 2,435.72 ఎకరాలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,338.74 ఎకరాలను సేకరించారు. ఇంకా 96.98 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
పనులు 38 శాతం... ఖర్చు 71.73 శాతం
రిజర్వాయర్ పనులు ఇప్పటివరకు 38 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఖర్చుల విషయంలో మాత్రం గత టిడిపి ప్రభుత్వం ఎక్కడా తగ్గలేదు. రిజర్వాయర్ నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.123.25 కోట్ల నుంచి రూ.466.28 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. అందులో రూ.314.16 కోట్లను వెచ్చింది. అంటే 71.73 శాతం మేర ఖర్చు చేసింది.
ఖరారు కాని టెండర్లు
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత నిర్మాణ సంస్థ కాంట్రాక్టును రద్దు చేసింది. పనులను వేరే నిర్మాణ సంస్థకు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో ప్రారంభంలో ప్రాజెక్టుకు నిర్ణయించిన అంచనా వ్యయాన్ని సవరించి రూ.852,45 కోట్లతో కొత్త స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ (ఎస్‌ఎస్‌ఆర్)తో పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులోనే పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఇప్పటికీ టెండర్లు పిలవకపోవడంతో ఎప్పుడు పనులు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
పెరిగిన ఆర్ అండ్ ఆర్ ఖర్చు
ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.123.25 కోట్లతో ప్రారంభమయ్యాయి. 2014 అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం అంచనా వ్యయాన్ని అమాంతం రూ.466.28 కోట్లకు పెంచింది. అందులో రూ.314.16 కోట్లను ఖర్చు చేసింది. ఇప్పుడు తాజాగా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.123.25 కోట్ల నుంచి రూ.855 కోట్లకు చేరింది. ఇప్పటివరకు రూ.314.57 కోట్లను ఖర్చు చేయడంతో మరో రూ.508.57 కోట్లను కేటాయించాల్సి ఉంది.
ఆఫ్‌షోర్ పూర్తికి ప్రాధాన్యం
ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఆఫ్‌షోర్‌ను ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేర్చి నిధుల కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కొత్తగా టెండర్లను పిలిచి మిగిలిన పనులను పూర్తి చేస్తాం.
- డోల తిరుమలరావు, ఎస్‌ఇ, జలవనరులశాఖ










