
- మ్యాచ్‌కు ముందు సచిన్ విగ్రహం ఆవిష్కరణ
ముంబయి: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో ఎదురులేని టీమిండియా.. నేడు మరో కీలకపోరుకు సిద్ధమైంది. నేడు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో పోరుకు సిద్ధమైంది. ఈ టోర్నీలో పటిష్ఠమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్‌తోపాటు బంగ్లాదేశ్‌పాటు రెండు సంచలనాలను నమోదు చేసిన అఫ్గాన్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ఆడిన ఆరింట్లోనూ గెలిచింది. ఇప్పటికే సెమీస్‌కు చేరిన టీమిండియా.. మిగిలి మూడు మ్యాచుల్లోనూ నెగ్గడమే లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తే.. గ్రూప్ 'టాపర్ ఆఫ్ ది టోర్నీ'గా సెమీస్‌కు చేరుకోవడంతోపాటు రికార్డును నెలకొల్పనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియాను శ్రీలంక ఓడించడం కష్టసాధ్యమే. షమీ, బుమ్రా పదునైన బౌలింగ్‌కు తోడు బ్యాటింగ్‌లో రోహిత్, విరాట్, గిల్, కెఎల్ రాహుల్ ఫామ్‌లో ఉండడం కలిసిరానుంది. గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్ పాండ్యా కోలుకున్నాడు. ఇక వాంఖడే మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండోసారి బ్యాటింగ్‌కు దిగే జట్టుపై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించొచ్చు. ఈ టోర్నీలో ఆశించినస్థాయిలో రాణించలేకపోతున్న మహ్మద్ సిరాజ్ స్థానంలో జట్టులోకి వచ్చిన షమీ.. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఏకంగా 9వికెట్లు తీశాడు.
టీమిండియాదే ఆధిపత్యం...
ఇరుజట్ల జరిగిన వన్డేల్లో మనదే ఆధిపత్యం. భారత్‌ాశ్రీలంక జట్ల మధ్య మొత్తం 167వన్డేలు జరగ్గా.. 98మ్యాచుల్లో టీమిండియా, 57వన్డేల్లో శ్రీలంక గెలిచాయి. మరో 11 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఒకటి టైగా ముగిసింది. ఇటీవల ఇరుజట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించడం విశేషం. ఇందులో ఆసియా కప్ ఫైనల్లో భారతజట్టు కేవలం 50 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేసింది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. శ్రీలంకపై సిరాజ్‌కు అద్భుత బౌలింగ్ రికార్డు ఉన్న నేపథ్యంలో టీమిండియా తుదిజట్టులో అతడికి చోటు దక్కినా ఆశ్చర్యపోన్నకర్లేదు. ఇక వన్డే ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఇరుజట్లూ 9 మ్యాచుల్లో తలపడ్డాయి. చెరో నాలుగింటిలో విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మరోవైపు శ్రీలంక జట్టు గత మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో నైరాశ్యంలో ఉంది. ఈ టోర్నమెంట్‌లో ఆడిన 6మ్యాచుల్లో శ్రీలంక జట్టు కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచింంది. పాథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, సదీరా సమరవిక్రమ మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు. మధుశంక, వెల్లలాగే, కసున్ రజిత, తీక్షణ భారత పిచ్‌లపై ఆడిన అనుభవముంది.

- సచిన్ విగ్రహం ఆవిష్కరణ
వాంఖడే స్టేడియంలో భారత్‌ాశ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సచిన్ టెండూల్కర్ స్టాండ్ సమీపంలో ఈ విగ్రహాన్ని నవంబర్ 2న వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఎంసిఏ అధ్యక్షుడు అమోల్ కాలే తెలిపారు. ఈ కార్యక్రమంలో సచిన్‌తోపాటు పలువురు ప్రముఖులు, భారత జట్టు సభ్యులు కూడా ఈ వేడుకకు హజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్‌లో 50ఏళ్లు నిండిన లెజెండ్‌కు నివాళిగా టెండూల్కర్ జీవిత-పరిమాణ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అసోసియేషన్ నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టెండూల్కర్.. వాంఖడే మైదానంలో ఒక స్టాండ్‌కి అతని పేరును కలిగి ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 100సెంచరీలను నమోదు చేయడంతోపాటు వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ(2010) కొట్టిన తొలి ఆటగాడు కూడాను.