Sep 08,2023 08:00

న్యూఢిల్లీ : సనాతనధర్మాన్ని ఎవరూ ప్రశ్నించడానికి వీలు లేదన్నట్టు మాట్లాడుతున్న బిజెపి భారత రాజ్యాంగాన్ని అంగీకరిస్తుందా? అని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ సూటిగా ప్రశ్నించారు. ఆయన గురువారం నాడు తన ఫేస్‌బుక్‌లో ఈ మేరకు ఒక పోస్ట్‌ పెట్టారు. మన రాజ్యాంగం మానవ సమానత్వమే మన రాజ్యాంగానికి ఆలంబన అని ఆయన అన్నారు. ద్రవిడ ఉద్యమం ప్రకారం సనాతన ధర్మాన్ని విమర్శించిన ఉదయనిధి స్టాలిన్‌కు 'వాస్తవాలతో సరైన సమాధానం' చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్లు వచ్చిన వార్తలపై బేబీ స్పందించారు. సనాతనధర్మంలో భాగమైన వర్ణధర్మానికి, అదే చాతుర్వర్ణ వ్యవస్థకు బిజెపి మద్దతిస్తుందా అని ఆయన నిలదీశారు. మానవులు వివిధ వర్ణాలలో (కులాలలో) జన్మించి, తమ తమ కులాలకు కేటాయించిన విధులను మాత్రమే నిర్వర్తించాలని మీరు కోరుకుంటున్నారా? అమానుషమైన కులతత్వం నేటికీ కొనసాగాల నుకుంటున్నారా? సనాతన ధర్మం పేరుతో నస్త్రీ స్వాతంత్యమర్హతి (మహిళలు చదువుకోవడానికి అర్హులు కారు), శూద్రులు చదువుకోవడానికి వీల్లేదు, పంచములను అంటుకోరాదు వంటి అమానుష భావనలను సమాజంపై రుద్దారు. ఈ విషయం ప్రధానికి తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. శూద్రుడు చదువుకోకూడదు, పంచములు నేర్చుకోకూడదు, మహిళలకు మానవ హక్కులు ఉండకూడదని ప్రధాని భావిస్తున్నారా? శ్రీ నారాయణగురు వంటి హిందూ సంస్కర్తలను బిజెపి తిరస్కరిస్తోందా? గురువు సనాతనధర్మాన్ని బాహాటంగానే తిరస్కరించాడు. సనాతన ధర్మం వుంటే నేడు హిందువులు పునరుజ్జీవనోద్యమ విలువలతో జీవించగలరా? ఇప్పుడు, సనాతనధర్మ ఆలోచనలను సవరించగలిగితే, వేటిని సవరిస్తారు? బ్రాహ్మణిజం సంస్కరించ బడుతుందా - అని బేబి అడిగారు.