- ప్రమాదంలో ప్రజాస్వామ్యం : ఎస్‌వికె వెబినార్‌లో వక్తలు
ప్రజాశక్తి హైదరాబాద్ బ్యూరో : ప్రశ్న ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోందని, ప్రశ్నిస్తే పాలకులు సహించలేకపోతున్నారని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, పాత్రికేయ విలువల్ని కాలరాస్తోందని, దానిలో భాగంగానే 'న్యూస్‌క్లిక్'పై అక్రమ కేసులు, అరెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడులు అన్న అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం వెబినార్ జరిగింది. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ఒయు జర్నలిజం రిటైర్డ్ అధ్యాపకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధ్యాపకులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వక్తలుగా మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక మీడియాను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకుంటో ందని, అలా కుదరనప్పుడు ఆ సంస్థల్నే పూర్తిగా కొనుగోలు చేస్తోందని, అదీ సాధ్యం కాకుంటే 'ఉపా' చట్టం ప్రయోగించి ప్రశ్నించే మీడియా సంస్థల నోరునొక్కే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 'న్యూస్‌క్లిక్' యాజమాన్యం ప్రజాసమస్యలకు బాసటగా నిలిచిందని, దానిలో భాగంగానే అభ్యుదయ భావాలున్న ప్రబీర్ పుర్కాయస్థ... ఢిల్లీ రైతాంగ పోరాటం, ఢిల్లీలో పౌరహక్కులు, కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన లు, మణిపూర్ హింసలో ప్రభుత్వాల ఉదాశీనత వంటి అంశాలను జనబాహూళ్యంలోకి తెస్తూ బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని తెలిపారు. దాన్ని సహించలేకే కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థపై తప్పుడు కేసులు పెట్టి, వేధింపులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక మీడియా సంస్థపై దాడి కాదని, పౌరసమాజంపై పాలకవర్గం చేస్తున్న దాడిగానే చూడాలని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బిబిసిని బెదిరించి, అదుపుచేసే ప్రయత్నం చేసిందని, ఎన్‌డిటివిలోకి దొడ్డిదోవలో పెట్టుబడులు పెట్టించి, దాన్ని హస్తగతం చేసుకొని ప్రభుత్వ అనుకూల మీడియాగా మార్చేసిందని తెలిపారు. న్యూస్‌క్లిక్ సంపాదకులను అరెస్టు చేసి ఢిల్లీ రైతాంగ పోరాటానికి అనుకూలంగా ఎందుకు వ్యవహరించారని, షహీన్‌బాగ్ ఆందోళనల్లో భాగస్వాములైన బాధితుల గాథలు ఎందుకు ప్రచురించారని ప్రశ్నిస్తున్నారని, దర్యాప్తు సంస్థల దిగజారుడుతనానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. దేశంలో ఒకే గొంతు వినపడాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తున్నాయని, భిన్నాభిప్రాయాలు, ప్రశ్నలు ఉండరాదనే ఉద్దేశంతోనే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూస్తున్నాయని అన్నారు. న్యూస్ క్లిక్‌పై జరిగిన దాడి, రేపు మరో సంస్థపైనా జరుగుతుందని, మీడియా పక్షాన నిలవాల్సిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఎటునిలవాలో తేల్చుకోలేని డోలాయమానంలో ఉండిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జర్నలిస్టులపై 'ఉపా' చట్టం పెట్టినప్పుడు స్పందించాల్సిన స్థాయిలో పాత్రికేయ సమాజం చొరవ చూపట్లేదని, ఇలాంటి చర్యలు ప్రభుత్వాలకు మరింత అనుకూలంగా మారుతున్నాయని అన్నారు. మీడియా సంస్థలకు చైనా నుంచి నిధులు వస్తున్నాయని కేంద్రప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.