Sep 21,2023 22:13
  • నేడు ఆస్ట్రేలియాతో తొలి వన్డే
  • మధ్యాహ్నాం 1.30గం||ల నుంచి

మొహాలీ: ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు ముందు జరిగే భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్‌ జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొహాలీలో జరిగే తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో పోరుకు భారత్‌ సిద్ధమైంది. రోహిత్‌ శర్మ, కోహ్లి తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకోగా.. కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని భారతజట్టు తొలి పరీక్షను ఎదుర్కోనుంది. ఈ సిరీస్‌ను నెగ్గి వన్డేల్లో భారతజట్టు అగ్రస్థానానికి ఎగబాకే అవకాశముంది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే ప్రపంచ కప్‌ పోటీల్లో భారతజట్టు టాప్‌ ర్యాంక్‌తో బరిలోకి దిగనుంది. ఇప్పటికే టీమిండియా టెస్టులు, టి20ల్లో టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్‌, బుమ్రా, షమీలకు ఈ సిరీస్‌ కీలకం కానుంది. మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనలో టి20 సిరీస్‌ను చేజిక్కించుకన్న ఆసీస్‌ జట్టు వన్డే సిరీస్‌లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబూషేన్‌లకు ఈ సిరీస్‌ కీలకంగా మారింది. మిచెల్‌ స్టార్క్‌, ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ గాయంతో తొలి వన్డేకు దూరం అయ్యారు. దాంతో, రాహుల్‌ సేనకు ఆస్ట్రేలియాను ఓడించేందుకు ఇది మంచి చాన్స్‌.
జట్లు(అంచనా) :
భారత్‌: కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌, శ్రేయస్‌, సూర్యకుమార్‌, జడేజా, సుందర్‌, అశ్విన్‌, షమి, సిరాజ్‌, బుమ్రా.
ఆస్ట్రేలియా: కమిన్స్‌(కెప్టెన్‌), వార్నర్‌, మార్ష్‌, స్మిత్‌, లబూషేన్‌, కేరీ(వికెట్‌ కీపర్‌), గ్రీన్‌, స్టోయినిస్‌, జాన్సన్‌, జంపా, హేజిల్‌వుడ్‌.