ముంబయి: కృత్రిమ మేధ కొత్తపుంతలు తొక్కుతోన్న వేళ.. కొత్తగా వస్తోన్న టూల్స్ ఉద్యోగాలపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పదాలు, ఇమేజ్, ఆడియో, సింథెటిక్ డేటా (కృత్రిమ సమాచారం)ను ఉత్పత్తి చేసే ఒక రకమైన కృత్రిమ మేధనే జనరేటివ్ ఏఐగా పరిగణిస్తారు. 'ఏఐ అనేది కో-వర్కర్‌గా మాత్రమే ఉంటుంది. కస్టమర్‌ను అర్థం చేసుకునేందుకు అది కొంత సమయం తీసుకుంటుంది. ఈ క్రమంలో.. ఉద్యోగాల స్థానాన్ని భర్తీ చేస్తాయని కాదు.. కానీ, ఉద్యోగ నిర్వచనాలు మాత్రం మారతాయి' అని టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్‌ఓ మిలింద్ లక్కాడ్ పేర్కొన్నారు.
ముఖ్యంగా చాట్‌జీపీటీ వంటి విప్లవాత్మక సాంకేతికతతో ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతుండవచ్చనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐలు కేవలం 'ఏఐ సహౌద్యోగిని' సృష్టిస్తాయని.. ఉద్యోగాల స్థానాన్ని భర్తీ చేయవని భావిస్తున్నట్లు దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ పేర్కొంది. ఉత్పాదకతను మెరుగుపరచడంలో ఇటువంటి టూల్స్ దోహదం చేస్తాయని.. కంపెనీల బిజినెస్ మోడల్‌ను మాత్రం మార్చలేవని అభిప్రాయపడింది.
భవిష్యత్తు కోసం చాట్‌జీపీటీ మంచిదేనని.. ఉద్యోగులకూ ఇది సహకారంగా ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. ఇటువంటి టూల్స్ వచ్చినప్పటికీ.. బిజినెస్ మోడల్‌ను మాత్రం మార్చలేవని మిలింద్ లక్కాడ్ స్పష్టం చేశారు. ఉత్పాదకత పెంచడం, పనిలో స్థిరత్వం, పాలనా అవసరాన్ని తగ్గించడం, వేగంగా డెలివరీ చేయడం వంటి వాటికి ఇటువంటి టూల్స్ ఎంతో దోహదపడతాయని చెప్పారు. టీసీఎస్ ఇప్పటికే అటువంటివి కొన్నింటిని వినియోగిస్తోందని.. వచ్చే రెండేళ్లలో వీటి పనితీరుకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.
విప్లవాత్మకమే.. కానీ..
చాట్‌జీపీటీ అనేది ఎంతో విప్లవాత్మకమైన, అత్యంత ఉత్పాదకతను కలిగించేదేనని ఐసీఆర్‌ఐఈఆర్ ఛైర్మన్, జెన్‌పాక్ట్ వ్యవస్థాపకుడు ప్రమోద్ భాసిస్ పేర్కొన్నారు. అయినప్పటికీ.. పని ప్రదేశాల్లో ఉద్యోగులు వీటిని ఏవిధంగా వినియోగించాలనే విషయంపై నిబంధనలు, విధానాలపై త్వరితగతిన ఆలోచన చేయాలని సూచించారు. ముఖ్యంగా కంపెనీలు, సంస్థలు వీటి వాడకం గురించి స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధ , చాట్‌జీపీటీలపై కొన్ని భయాలు నెలకొన్నా, ఈ రెండు విభాగాలు కొత్తగా ఉపాధి, అధిక ఉత్పాదకత కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తాయని ప్రమోద్ భాసిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.










