Jul 01,2023 10:40
  • హింస వెనక కేంద్రానికి రహస్య అజెండా ఉన్నదని ఆరోపణ

ఇంఫాల్‌ : మణిపూర్‌లో కొనసాగుతున్న హింస విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వహించడాన్ని ఈశాన్య విద్యార్థుల సంస్థ (ఎన్‌ఈఎస్‌ఓ) ప్రశ్నించింది. మోడీ తీరును విమర్శించింది. మణిపూర్‌ హింస వెనకాల కేంద్రానికి ఒక రహస్య అజెండా ఉన్నదని ఆరోపించింది. రాష్ట్రంలో రెండు నెలలుగా అల్లకల్లోల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ.. ప్రధాని స్పందించకపోవటం పట్ల ఎన్‌ఈఎస్‌ఓ చైర్మెన్‌ శామ్యూల్‌ జైర్వా ఆశ్చర్యాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏ విషయం జరిగినా వాటిపై మాట్లాడటానికి క్రియాశీలంగా ఉండే ప్రధాని.. మణిపూర్‌ విషయంలో మౌనంగా ఉన్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలనీ, హింసను ఆపడానికి, సమస్యలను పరిష్కరించడానికి క్రియాశీల చర్యలు తీసుకోవాలని జైర్వా.. ప్రధానిని కోరారు. రాష్ట్రంలోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. శాంతి కోసం పిలుపునిచ్చారు.