Sep 07,2023 09:39
  • దేశం పేరు మార్పును కేంద్రం తక్షణమే విరమించుకోవాలి : పినరయి విజయన్‌
  • జమిలి ఎన్నికలపై ప్రజాస్వామ్య శక్తులన్నీ ప్రతిఘటించాలి

తిరువనంతపురం : 'ఇండియా' పదానికి బిజెపి ఎందుకు అంతగా భయపడుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బుధవారం ప్రశ్నించారు. దేశం పేరు మార్పు ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని విజయన్‌ డిమాండ్‌ చేశారు. ''ఇండియా' అనే పేరును మార్చడం రాజ్యాంగానికి, దేశానికే విరుద్ధం. రాజ్యాంగంలో మొదటి ఆర్టికల్‌లో మన దేశం పేరును 'ఇండియా, ఇది భారత్‌'గా పేర్కొనారు. రాజ్యాంగంలోని పీఠిక యొక్క ప్రారంభం 'మేము, భారతదేశ ప్రజలు' అని ప్రారంభమవుతుంది' అని విజయన్‌ తెలిపారు. 'ఏ రాజకీయ ఎత్తుగడ కూడా దేశానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి దేశం పేరు మార్చే ప్రయత్నాలను కేంద్రప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి' అని విజయన్‌ డిమాండ్‌ చేశారు.
           మోడీ ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ఒకే దేశం... ఒకే ఎన్నిక విధానం అమలైతే కేంద్రానికి అడ్డూ అదుపూ లేని అపరిమిత అధికారాలు కట్టబెడుతుందని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ ముందుకు వచ్చి గళం విప్పాలని ఆయన కోరారు. బిజెపి ఆలోచన భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజాస్వామ్య శక్తులన్నీ దీనిని గట్టిగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.
         'ఒకే దేశం... ఒకే ఎన్నిక సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దాలన్న సంఫ్‌ు పరివార్‌ ప్రయత్నాలు దాని నీచమైన అజెండాను ప్రతిబింబిస్తున్నాయి. తన అధికారాన్ని పటిష్టం చేసుకునేందుకు సంఫ్‌ు పరివార్‌ మన రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలను ధ్వంసం చేయాలని చూస్తోంది. ఈ విషపూరిత ప్రయత్నాలను వ్యతిరేకించేందుకు మనమంతా సంఘటితం కావాలి. భారత రిపబ్లిక్‌కు పునాదిగా ఉన్న సూత్రాలను పరిరక్షించుకోవాలి' అని పినరయి 'ఎక్స్‌'లో ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలకు తలవంచేందుకు నిరాకరించే రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచి, ఆయా రాష్ట్రాలలో దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అజెండాను సిద్ధం చేశారని విమర్శించారు. రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు సమయాలలో జరుగుతాయని, దీనివల్ల పార్లమెంట్‌ ఎగువసభలో వివిధ పార్టీల బలాబలాలలో తేడా వస్తుందని తెలిపారు. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే రాజ్యసభ రాజకీయ వైవిధ్యం కనుమరుగవుతుందని వివరించారు.
          ఈ సంవత్సరం చివరలో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే బిజెపి హడావిడిగా జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చిందని పినరయి వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైతే రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడుతుందేమోనని బిజెపి ఆందోళన చెందుతోందని తెలిపారు. సంఫ్‌ు పరివార్‌ కోరుకుంటున్నట్లు దేశ ఎన్నికల వ్యవస్థను నాశనం చేయడానికి రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య క్రమం అంగీకరించబోవని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ వైవిధ్యాన్ని నాశనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను దేశంలోని ప్రజాస్వామ్య శక్తులన్నీ ప్రతిఘటించాలని పినరయి విజయన్‌ పిలుపునిచ్చారు.