May 03,2023 09:37
  • రాష్ట్ర స్థాయిల్లో వ్యూహాలు అవసరం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు పినరయి విజయన్‌ కేరళ ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టి ఈ నెలాఖరుకు ఏడేళ్లు పూర్తి చేసుకుంటున్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై కేరళ ముఖ్యమంత్రిగా ఆయన ఎనలేని పోరాటం చేస్తున్నారు. రాష్ట్రాల హక్కుల కోసం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఇతర ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుపుకొని వివిధ రూపాల్లో సమిష్టి పోరాటం సాగిస్తున్నారు. కేరళ అభివృద్ధికి వినూత్న ప్రణాళికలు రచిస్తూ ఆదర్శ పాలన అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక జాతీయ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ సారాంశం.

కేంద్రంతో రాష్ట్రాలకు వస్తున్న వివిధ సమస్యలపై ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఏకమవుతున్నారు. సీనియర్‌ ముఖ్యమంత్రుల్లో ఒకరిగా మీ అభిప్రాయమేంటి ?
కేంద్రం చర్యల వల్ల ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సమాఖ్య స్ఫూర్తిని బిజెపి పదేపదే నీరుగారుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను తరుచూ ఇరుకున పెడుతోంది. అధికారాలను కేంద్రీకరిస్తూ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది. రాష్ట్రాల ప్రత్యేక అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకునే ధోరణిని పెరుగుతోంది. రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం లాక్కుంటోంది. ఈ వైఖరిపై నిరసనలు వెల్లువెత్తుతున్నా, కేంద్రం పట్టించుకోవడం లేదు. కేంద్రాన్ని నిలదీస్తున్న రాష్ట్రాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, గవర్నర్ల వ్యవస్థ ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిని ప్రజలు కూడా గమనిస్తున్నారు. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం లభించని సందర్భాలు అనేకం ఉన్నాయి. గవర్నర్లు కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.

   గవర్నర్ల తీరు పలు రాష్ట్రాల్లో వివాదస్పదంగా మారింది. తమిళనాడు, తెలంగాణ కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నాయి. కేరళలో పరిస్థితి ఏమిటి ?

కేరళలో గవర్నర్‌ ఇలాంటి ఎత్తుగడలు వేయరాదని కోరుకుంటున్నాం. గవర్నర్లు తమ వైఖరి మర్చుకోవాలి. ప్రస్తుతం మాకు అలాంటి పరిస్థితి రావడం లేదు. అయితే గవర్నర్ల తీరులో మార్పు వస్తుందని ఆశించాం.కానీ మార్పు కనిపించడం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలన్నది ఆలోచిస్తున్నాం.
 

               కేరళపై బిజెపి ప్రత్యేక దృష్టి సారిస్తోంది కదా? ప్రధాని రోడ్‌ షోలు కూడా నిర్వహిస్తున్నారు. ఇదంతా బిజెపికి కలిసివస్తుందా ?

అధికార పార్టీగా ఎదగడానికి బిజెపి పలు వ్యూహాత్మక మార్గాలను అనుసరించింది. కేరళ పరిస్థితులను అందుకు అనుగుణంగా మలుచుకొవాలని కుట్ర చేస్తున్నారు. అయితే కేరళ దేశంలోనే వైవిధ్యభరితమైనదని తెలుసుకోవాలి. కేరళీయులు బిజెపి సిద్ధాంతాన్ని దరి చేరనివ్వరు. ఇది బిజెపికి కూడా తెలుసు. ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. కేరళలో అడుగుపెట్టలేకపోయారు. అందుకనే ఇప్పుడు మైనార్టీలను బూచిగా చూపి రాజకీయ పబ్బం గడుపుకొనే కుట్రలు చేస్తున్నారు. బిజెపి అనేది ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో నడిచే మతతత్వ పార్టీ అని అందరికీ తెలుసు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో నిత్యం మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో మైనార్టీలను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. ఇలాంటి వినాశకర ఎత్తుగడలను కేరళ వ్యతిరేకిస్తుంది. కేరళలో మైనార్టీలు అభద్రతగా ఏమాత్రమూ భావించడం లేదు.
 

                                    బిజెపి సాగిస్తున్న ఈ దాడులను కేరళలో వామపక్షాలు ఎలా ఎదుర్కొంటాయి ?

ఇందుకేమీ ప్రత్యేక ప్రణాళిక అవసరం లేదు. ఎందుకంటే మేము చాలా కాలంగా అనుసరిస్తున్న విధానం ఉంది. ఆ విధానం, వైఖరి కారణంగానే కేరళ విభిన్నంగా నిలుస్తోంది. కేరళలో వామపక్షాల బలం అదే. అదే కేరళలో లౌకికవాదానానికి అతిపెద్ద హామీ. వామపక్షాలను బలహీనపరిచేందుకు ఇంతకుముందు ఎత్తులు వేశారు. ఇప్పుడూ వేస్తున్నారు. కానీ అదేమంత సులువైన వ్యవహారం కాదు. వారి ఆగడాలు ఫలించవు. సెక్యులరిజాన్ని కాపాడతామని ప్రజలకు తెలుసు.
 

                                                       కేరళలో బిజెపితో పోరాడే సత్తా కాంగ్రెస్‌కు ఉందా ?

జాతీయ స్థాయిలో బిజెపి పట్ల కాంగ్రెస్‌ వైఖరి ఎలా ఉన్నా..కేరళలో మాత్రం అది బిజెపితో కలిసే పనిచేస్తోంది. ఎల్‌డిఎఫ్‌ను ఎదుర్కోవడానికి మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కూడా కాంగ్రెస్‌ వెనుకాడటం లేదు. కేరళ పరిణామాలు గమనించే ఎవ్వరికైనా ఈ విషయం అర్థం అవుతుంది. కేరళలో యుడిఎఫ్‌, బిజెపి రెండూ కలిసేవున్నాయి. కాంగ్రెస్‌ జాతీయ వైఖరికి ఇది విరుద్ధం. కేరళలో బిజెపితో కాంగ్రెస్‌ పోరాడుతందనే భావన లౌకికవాదులెవ్వరికీ లేదు.
 

                                లోక్‌సభ ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. ప్రతిపక్షాల ఐక్యతపై మీరేమంటారు ?

బిజెపిని ఒంటరి పాల్జేసి, ఓడించేందుకు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అవసరం. దీని అర్థం ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని కలిగి ఉండటం కాదు. బిజెపిని ఓడించేందుకు ఏకతాటిపై రావడమే. రాష్ట్రాల స్థాయిల్లోనూ బిజెపిని ఓడించేందుకు వ్యూహాలు అవసరం. సిపిఎం ఇప్పటికే ఈ పిలుపునిచ్చింది. ఇందుకు భావసారూప్యత గల పార్టీలు సహకరించాలి. కేరళ విషయానికి వస్తే బిజెపి ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు.
 

                       ఎల్‌డిఎఫ్‌ 2.0 ప్రభుత్వం రెెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. పాలనలో ఏవైనా లోపాలు గుర్తించారా ?

లోపపాలేమీ లేవు. కాంగ్రెస్‌, బిజెపి చేస్తున్న ఆరోపణలు ఉద్దేశపూర్వకమైనవి. ఇది కేరళీయులను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే. ఎల్‌డిఎఫ్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు కాంగ్రెస్‌ నేతృత్వ యుడిఎఫ్‌ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నుంచి ప్రత్యేక సహాయాన్ని కూడా అర్థిస్తున్నాయి. బిజెపి, కాంగ్రెస్‌ రెండూ ఒక్కటై కుట్రలు చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించారు. కానీ ప్రజలు వారికి గట్టి గుణపాఠం చెప్పారు. అందుకే ప్రజలు ఎల్‌డిఎఫ్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలుస్తున్నారు.
 

                                                         రాబోయే కాలానికి మీ కార్యాచరణ ఏమిటి ?

ఇక ముందుకు కూడా ప్రజల శ్రేయస్సు కోరే ప్రత్యామ్నాయ అజెండానే కొనసాగిస్తాం. అన్నింటా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి.్ధ రాబోయే మూడేళ్లకు మాత్రమే కాదు.. రాబోయే పదేళ్లు, 25 ఏళ్లు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా కేరళనున ఎలా తీర్చిదిద్దగలం? ఇందుకోసం నలుమూలాలకు విస్తరించే అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వీటితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తాం. అభివృద్ధి, సంక్షేమం రెండు గుర్రాలుగా పని చేయాలి. ఇదే మా అజెండా.
 

                                                                  కర్ణాటక ఎన్నికలపై మీ అంచనా ?

కర్ణాటకలో బిజెపికి వ్యతిరేకంగా సెంటిమెంట్‌ పెరుగుతోంది. బిజెపి ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని సాధారణ వాతావరణం నెలకొంది.

                                                           'కేరళ స్టోరీ' చిత్రంపై అభ్యంతరాలేమిటీ ?

వాస్తవాలతో సంబంధం లేకుండా తెరకెక్కించిన చిత్రమిది. ఒక చెత్త సినిమా. 'లవ్‌ జిహాద్‌' అనే అంశమే పెద్ద కుట్ర. సుప్రీం కోర్టు కూడా దీనిని పరిశీలిస్తోంది. 'లవ్‌ జిహాద్‌' అనేది ఎక్కడా లేదని స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారు. ప్రజల మధ్య విభేదాలు రాజేసి లబ్దిపొందేందుకు సంఫ్‌ు పరివారం తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రజలను చీల్చడమే ఇలాంటి ప్రచారాల వెనుకున్న ఎత్తుగడ. ఫిర్యాదులు లేకపోయిన విద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలకు అనుగుణంగా 'కేరళ స్టోరీ' చిత్రంపై అవసరమైతే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం.