Oct 18,2023 17:41

న్యూఢిల్లీ : జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్‌ 2008, సెప్టెంబర్‌ 30వ తేదీన దారుణంగా హత్యకు గురైంది. ఈ కేసులో మహారాష్ట్ర కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ యాక్ట్‌ (ఎంసిఓసిఎ) నిబంధనల ప్రకారం నిందితులను ఢిల్లీ కోర్టు కూడా దోషులుగా నిర్ధారించింది. రవి కపూర్‌, అమిత్‌ శుక్లా, బల్జిత్‌ మల్లిక్‌, అక్షరు కుమార్‌లతోపాటు వీరికి సహాయపడిన అజరు సేథి కూడా దోపిడి, హత్యకు పాల్పడ్డారని దోషులుగా తేల్చుతూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు అనంతరం సౌమ్యా తల్లి మీడియాతో మాట్లాడారు. 'నా కూతురు చనిపోయింది. కానీ ఈ చట్టం ఇతరులకు నిరోధకంగా పనిచేస్తుంది. నా కుమార్తెని చంపిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని కోరుతున్నాను.' అని ఆమె అన్నారు.
కాగా, సౌమ్యా విశ్వనాథన్‌ (25) ఢిల్లీలో సెప్టెంబర్‌ 30న వసంత విహార్‌లో తన పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఆమె హత్యకు గురైంది. ఆమె మృతదేహం తన కారులో లభ్యమైందని, తలకు బలమైన గాయం తగిలిందని పోలీసులు తెలిపారు. ఐటి ఎగ్జిక్యూటివ్‌ జిగిషా ఘోష్‌ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో సౌమ్యా చనిపోయిన కొన్ని నెలల తర్వాత ఆమె మృతదేహం ఫరీదాబాద్‌లో పోలీసులు గుర్తించారు. జిగిషా మృతికి, సౌమ్యా విశ్వనాథన్‌ హత్యకు సంబంధమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రెండు కేసుల్లో కపూర్‌, శుక్లా, మాలిక్‌లతోపాటు మరో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. 2009లో సౌమ్యా హత్య కేసుపై ఢిల్లీ పోలీసులు 620 పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ ఐదుగురిపై హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి అభియోగాల కింద అరెస్టు చేసినట్లు సీనియర్‌ పోలీసు అధికారి హెచ్‌జిఎస్‌ ధాలివాల్‌ గతంలో తెలిపారు. ముంబయిలో తొలిసారిగా అమల్లోకి వచ్చిన ఎంసిఓసిఎని 2002లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఢిల్లీకి విస్తరించింది.