
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సిఎండిఆర్‌ఎఫ్)పై ఆరోపణల కేసులో కేరళ సిఎం పినరయి విజయన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ లోకాయుక్త తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా సిఎం విజయన్‌తోపాటు 18 మంది మాజీ మంత్రులపై వేసిన పిటిషన్‌ను లోకాయుక్త తిరస్కరించింది. బంధుప్రీతి లేదా అవినీతి జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని లోకాయుక్త జస్టిస్ సిరియాక్ జోసెఫ్, అప్ లోకాయుక్తలు జస్టిస్ హరూన్ అల్ రషీద్, జస్టిస్ బాబు మాథ్యూ పి జోసెఫ్‌తో కూడిన లోకాయుక్త ధర్మాసనం పేర్కొంది. సిఎండిఆర్‌ఎఫ్‌లో నిధులను దుర్వినియోగం చేశారంటూ 2018లో సిఎంతోపాటు, పలువురు మంత్రులపై కాంగ్రెస్ నేత ఆర్‌ఎస్ శశికుమార్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సిరియాక్ జోసెఫ్, జస్టిస్ హరున్ ఉల్ రషీద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాజ్యాన్ని విచారించినా, ఏకగ్రీవ నిర్ణయానికి రాలేకపోయింది. 2023 మార్చిలో ఈ కేసును విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసింది. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధిస్తూ తీర్పు ఇచ్చింది.