- 1948 జూన్‌లో కాకుండా 1947 ఆగస్టులో రావడం వెనుక....?
1948 జూన్‌లో స్వాతంత్య్రం ప్రకటిస్తారనుకుంటే దానికి పది మాసాల ముందే అంటే 1947 ఆగస్టు15న మనకు స్వాతంత్య్రం సిద్ధించింది. అప్పటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ఆదరాబాదరాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత దేశం నుండి వచ్చిన ఆందోళనకరమైన వార్తలు వెస్ట్ మినిస్టర్‌ను బెంబేలెత్తించాయి. అట్లీ తొందరపాటుకు అదే కారణం. ఇంతకీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని అంతగా ఆందోళనకు గురిచేసిన అంశమేమిటి? అదే రాయల్ ఇండియన్ నేవీలో తలెత్తిన తిరుగుబాటు! అది దావానలంలా వ్యాపిస్తోంది. ఈ చారిత్రాత్మక ఘటన అనుకూల, ప్రతికూలతల గురించి ప్రమోద్ కపూర్ '1946: ది లాస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, రాయల్ ఇండియన్ నేవీ మ్యుటిని' అన్న పరిశోధనాత్మక గ్రంథంలో అద్భుతంగా వివరించాడు. ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకం అది.
1965 పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్పల్ దత్ 'కల్లోల్' నాటకాన్ని ప్రదర్శించకుండా చేసేందుకు ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్నీ పన్నింది. కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటిని అధిగమించి మినర్వా థియేటర్‌లో భారీగా హాజరైన ప్రేక్షకుల ముందు ఆ నాటకం విజయవంతంగా ప్రదర్శించడం జరిగింది. తిరుగుబాటును అణచివేయాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పన్నాగం పన్నారంటే అర్థం చేసుకోవచ్చు.గమ్మత్తేమిటంటే కాంగ్రెస్ మౌన కుట్రకు పాల్పడడం. ఈ పుస్తకంలోని అత్యంతాసక్తికరమైన భాగం ఏమిటంటే, ఈ కుట్రలో పాల్గొన్న రాజకీయ నాయకులు ఎవరు? కుట్రదారులు ఎక్కడ కలిశారు?బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వల నుండి వారు ఎలా తప్పించుకున్నారు? అలా తప్పించుకున్నవారిలో ' విధేయులైన' భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ప్రముఖ చిత్ర నిర్మాత శ్యామ్ బెనెగల్ ఈ పుస్తకాన్ని ప్రశంసిస్తూ, అందులోని బలారుదత్ గురించి ఒక ఎపిసోడ్ తీశారు. తిరుగుబాటుదారుల్లో ఒకరైన బలారు దత్ యుక్త వయసు నుండి ఎలా ప్రేరణ పొందాడు, తరువాత గట్టి కమ్యూనిస్టుగా, లింటాస్‌లో అడ్వర్టయిజింగ్ ఎగ్జిక్యుటివ్‌గా ఎలా ఎదిగినదీ వివరించాడు.ఆ లింటాస్ సంస్థలోనే బెనెగల్ మొదట కాపీ రైటర్‌గా చేరాడు.
బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడిన యోధులుగా మన జాతీయ నాయకులు గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్‌లను వీరులు శూరులంటూ చేసే కొన్ని పొగడ్తల గాలి తీసి వాస్తవ స్థితిని ప్రజల ముందుంచేందుకు ప్రయత్నించిందీ పుస్తకం. వివక్షకు వ్యతిరేకంగా, పేదల రేషన్లకు వ్యతిరేకంగా వచ్చిన సామూహిక తిరుగుబాట్లను రేకెత్తించేవారిగా కన్నా బ్రిటిష్ వారిపట్ల సానుభూతిపరులుగానే వాళ్లంతా కనిపిస్తారు. లేకపోతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు తలెత్తితే, కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించినట్లు?
గాంధీ, పటేల్, జిన్నా వంటి సంప్రదాయవాద భారతీయ నాయకులు లండన్ లో మోగించిన ప్రమాద ఘంటికలేమిటంటే తిరుగుబాటు నాయకత్వం భారత కమ్యూనిస్టు పార్టీతో పోతోందనేది .ఎస్‌ఎ డాంగే కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అరుణా అసఫ్ అలీ వంటి వారు కాంగ్రెస్‌లో వామపక్ష నాయకులుగా ఉన్నారు. కాంగ్రెస్‌లో లెఫ్టిస్టుల గురించి నెహ్రూ ఆందోళన చెందారు. వారు పార్టీని వీడితే తాను బలహీనపడినట్టే కదా? అనేది ఆయన ఆందోళన.
కపూర్ తన పుస్తకంలో 'రహస్య కుట్రదారులు'గా కొందరిని పేర్కొంటూ, వారు పన్నిన పథకం ఫిబ్రవరి18న ఎలా తుస్సుమన్నదీ ప్రముఖ చరిత్రకారుడు సుమీత్ సర్కార్ రాసిన 'మోడర్న్ ఇండియా' పుస్తకం నుంచి కొన్ని భాగాలను ఉటంకించారు.' ఫిబ్రవరి20 మధ్యాహ్నం గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఆహారం తీసుకొచ్చిన జనాలు, దుకాణదారులు తమకు ఏం కావాలనుకుంటే అది తీసుకోమని ఆహ్వానించడంతో సోదరభావం వెల్లివిరిసింది.' మరి కాంగ్రెస్ దీనిని వ్యతిరేకిస్తుందా? తిరుగుబాటు 78 నౌకలు, 21 తీర గస్తీ దళాలు, 20వేలకు పైగా నావికా దళ సైనికులతో 48 గంటట్లోనే విస్తరించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధంలో అత్యంత బలీయమైన నౌకాదళంలో ఒక దానిని నిర్వీర్యం చేసింది.ఆ భీకర పోరులో వందలాది మంది చనిపోయారు.
ఇది కాంగ్రెస్, ముస్లిం లీగ్ నాయకత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. బ్రిటిష్‌వారిని భయపెట్టడం ద్వారా కాకుండా, మంచి ప్రవర్తన ద్వారా వారి నుంచి స్వాతంత్య్రం పొందవచ్చని వారు భావించారు.వారి ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. ఆవతలి వైపు అద్భుతమైన పృధ్వీరాజ్ కపూర్, సలీల్ చౌదరి, బలరాజ్ సాహ్ని, జోహ్రా సెహగల్, ఉత్పల్ దత్ అరుణా అసఫ్ అలీ, మినూ మసాని, అశోక్ మెహతా, ఖ్వాజా అహ్మద్ అబ్బాస్, జోష్ మలిహాబడి, సాహిర్ లుదియాన్వి వంటి వారు ఎదుటి వారిని మంత్ర ముగ్ధులను చేసే వాగ్ధాటితో తిరుగుబాటుకు ఊపిరులూదుతున్నారు.
హిందుస్తాన్ స్టాండర్డ్ పత్రిక ఫిబ్రవరి 28 నాటి సంచిక మొదటి పేజీలో కాంగ్రెస్ నాయకుల రియక్షన్స్‌ను చిందరవందరగా ప్రచురించింది. గాంధీ వ్యాఖ్యలను మాత్రం అయిదు కాలమ్స్‌తో పతాక శీర్షికన ఇచ్చింది. రాజ్యాంగపరంగా కన్నా బారికేడ్ల వద్ద హిందువులను, ముస్లింలను ఐక్యం గావించేందుకు తాను కృషి చేస్తానన్న అరుణా అసఫ్ ఆలీ వ్యాఖ్యలపై గాంధీ స్పందిస్తూ, 'బారికేడ్ జీవితం రాజ్యాంగం అనుసరించే ఉండాలి' అని అన్నారు. అంతేకాదు, అరుణా అసఫాలి బ్రిటిష్ డిక్లరేషన్ల పట్ల అవిశ్వాసాన్ని సృష్టిస్తూ, వారితో గొడవలను ప్రేరేపిస్తున్నారని గాంధీ పేర్కొన్నారు. అదే పేజీలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా అబుల్ కలామ్ అజాద్ వ్యాఖ్యలను ప్రచురించారు. 'జాతీయ స్పూర్తిని అణచివేయరాదు' అని అజాద్ వాదించారు.మరో వైపు సర్దార్ పటేల్ ' ఈ జన జాగృతిని ఇతరులు ఎక్కడ సొమ్ము చేసుకుంటారో' నని తీవ్రంగా మథనపడిపోయాడు. ఎవరా ఇతరులు? అనేది ఇక్కడ కీలకమైన అంశం.
బ్రిటిష్ సామ్రాజ్యానికి రాయల్ ఇండియన్ నేవీ చాలా దుర్బలంగా ఉండడం విస్తుగొలిపింది.కమ్యూనిస్టులు భారత్‌లోను, మిగతా ప్రపంచంలోనూ విజయాలు సాధిస్తుండడంతో వెస్ట్ మినిస్టర్‌లో గుబులు రేపింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946 జులైలోనే వార్తా పత్రికల్లో పతాక శీర్షికలను ఆక్రమించింది.ఇందుకు సంబంధించి కమ్యూనిస్టులు క్షేత్రస్థాయిలో భారీ నెట్‌వర్కును ఏర్పాటుచేసుకున్నారని ఇంటెలిజెన్స్ సమాచారం బ్రిటిష్ ప్రభుత్వానికి ముందే అందింది. చైనాలో మావో విప్లవం తుది ఘట్టానికి చేరుకుంటున్న సమయంలో రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటు తలెత్తింది. 1940, 50 దశకాల్లో వలసవాదం తగ్గుముఖం పడుతున్నది. సామ్రాజ్యవాదాన్ని సవాల్ చేయడం ద్వారా కమ్యూనిస్టులు కొరియాకు విస్తరించారు. ముఖ్యంగా 1950లో చైనీయులు యాలు నదిని దాటడం ద్వారా కొరియాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. భారత్‌లో బ్యాలెట్ ద్వారా కమ్యూనిస్టులు 1957లో తొలిసారి కేరళలో అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామాలన్నీ తరువాత జరిగాయి. కానీ, ఈ దిశగా గాలి వీస్తున్నదనే విషయం సామ్రాజ్యవాద పాలకులు ముందుగానే, అంటే తిరుగుబాటు విస్తరించినప్పుడే గ్రహించారు.తిరుగుబాటు విస్తరించిన వెంటనే లండన్‌లో క్లెమెంట్ అట్లీ ప్రభుత్వం మంత్రివర్గ బృందాన్ని పంపింది. లార్డ్ వేవెల్ స్థానంలో లార్డ్ మౌంట్ బాటెన్‌ను వైశ్రారుగా నియమించారు. 1948 జూన్30వ తేదీని స్వాతంత్య్ర ప్రకటనకు చివరి తేదీగా నిర్ణయించారు. లార్డ్ మౌంట్ బాటన్ దానిని పది మాసాల ముందుకు జరిపి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం ప్రకటించారు. లండన్ నుంచి వచ్చిన సందేశం మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 'మన లాంటి వ్యక్తులు'కు అధికారాన్ని అప్పగించండి. 1917లో బోల్షివిక్ విప్లవం విజయవంతమైన నాటి నుంచి ప్రపంచాన్ని చుట్టుముట్టిన వామపక్ష ప్రభంజనాన్ని పరిగణనలోకి తీసుకుంటే బ్రిటిష్ రాజ్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకునే భారత్‌లోని మితవాద రాజకీయ నాయకుల నేెల కదిలిపోయే ప్రమాదముంది. కావున మితవాద రాజకీయనాయకులకు అధికారం అప్పగించండి అని ఆ సందేశంలో పేర్కొంది.
సయీద్ నఖ్వీ, సీనియర్ పాత్రికేయులు
(డెక్కన్ క్రానికల్ సౌజన్యంతో)










