Jan 25,2023 10:05
  • క్యూబా ప్రజల ఐక్యతను నాశనం చేయడానికి అమెరికా ప్రయత్నం
  • చేగువేరా కుమార్తె అలైదా గువేరా
  • క్యూబాకి ఎల్లప్పుడూ సంఘీభావం: సీతారాం ఏచూరి
  • అలైదా గువేరా, ఎస్తెఫానియాకు ఢిల్లీలో ఘనస్వాగతం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : చే గువేరా మానవత్వం కోసం నిలిచారని చేగువేరా కుమార్తె అలైదా గువేరా తెలిపారు. వర్ణం, భాష, సంస్కృతి... మొదలైన భేదాలు ఉన్నా మనం ఒక్కటే అనే మానవతా భావం ఉండాలని అన్నారు. ప్రపంచంలో ఎలాంటి వ్యవస్థలోనైనా సమానత్వం కోసం నిలబడాలని క్యూబా విశ్వసిస్తుందని నొక్కి చెప్పారు. చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తెఫానియాకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం నాడిక్కడ హరి కిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో జాతీయ క్యూబా సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభ జరిగింది. వందలాది మంది 'చే' అభిమానులు విప్లవ గీతాలు ఆలపిస్తూ, నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. జెఎన్‌యు, ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన మలయాళీలతో సహా చాలా మంది విద్యార్థులు సూర్జీత్‌ భవన్‌కు తరలివచ్చారు. జెఎన్‌యు స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు ఐషీఘోష్‌ పుష్పగుచ్ఛాన్ని అలైదా గువేరాను అందజేశారు. ఈ సందర్భంగా అలైదా ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికా నిషేధం కారణంగా క్యూబా అనుభవిస్తున్న సవాళ్లను వివరించారు. క్యూబా అమెరికాతో పోరాడగలుగుతోందని, దానికి కారణం ఒక్కటేనని, క్యూబా ప్రజల ఐక్యత వల్లనే అని ఆమె నొక్కి చెప్పారు. అందుకే క్యూబా ప్రజల ఐక్యతను నాశనం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమెరికా ఆంక్షలను ఎదుర్కొవడానికి, అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి క్యూబా భారీగా వ్యయం చేయాల్సి వస్తుందని అన్నారు. క్యూబాకు సహకరించే అన్ని దేశాలు, వాణిజ్య సంస్థల పట్ల అమెరికా శత్రు వైఖరి అవలంబిస్తోందని పేర్కొన్నారు. అయితే అమెరికా బెదిరింపులను పట్టించుకోకుండా క్యూబాకు సహకరించే దేశాలు ఉన్నాయని, క్యూబా ఆ దేశాలు, సంస్థల పట్ల విధేయతగా ఉంటుందన్నారు. క్యూబా వైద్యులు ఏ దేశానికైనా, ఏ సమయంలోనైనా సేవ చేస్తారని అన్నారు. అమెరికా భయంతో ఐదేళ్ల చిన్నారికి సులువుగా దొరికే మందు ఇవ్వడానికి ఏ దేశం సిద్ధంగా లేదని ఆమె తెలిపారు.
 

                                             క్యూబాకి ఎల్లప్పుడూ సంఘీభావం: సీతారాం ఏచూరి

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ క్యూబా, భారతదేశం మధ్య సంఘీభావాన్ని గుర్తుచేసుకున్నారు. అలీన ఉద్యమంలో నాయకత్వం గురించి పంచుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అలీన దేశాల సదస్సులో పాల్గొనకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. క్యూబాకి ఎల్లప్పుడూ సంఘీభావంగా ఉంటామన్నారు. 'ది వైర్‌' ఎడిటర్‌, ప్రముఖ పాత్రికేయుడు సిద్ధార్థ్‌ వరదరాజన్‌ మాట్లాడుతూ జి-20కి అధ్యక్షత వహించే అవకాశాన్ని భారత్‌ సద్వినియోగం చేసుకోవాలని, క్యూబాపై అప్రజాస్వామిక, అమానవీయ ఆర్థిక ఆంక్షలను ముగించే ప్రతిపాదనను తీసుకురావాలని అన్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ క్యూబా పట్ల సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య మాట్లాడుతూ క్యూబాకి భారతదేశం అండగా ఉండాలన్నారు. ఆర్జేడి ఎంపి మనోజ్‌ ఝా, క్యూబా రాయబారి అలెజాండ్రో సిమాన్కాస్‌, నేషనల్‌ కమిటీ ఫర్‌ సాలిడారిటీ విత్‌ క్యూబా కన్వీనర్‌ ఎంఎ బేబి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డియుటిఎ మాజీ అధ్యక్షురాలు నందితా నారాయణ్‌, సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌. అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.