Jan 11,2023 08:11
  • జగనన్న పట్టాలతో గందరగోళం
  • ఒకే పాసుబుక్‌లో 19 మంది పేర్లు

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : భూ వివాదాలను పరిష్కరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన 'జగనన్న శాశ్వత భూహక్కు - భూ రక్ష' కార్యక్రమం అసలుకే ఎసరు తెచ్చిపెట్టేదిలా మారుతోంది. భూ యజమాని పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం సహజం. కానీ, కొత్త పథకంలో సర్వే నెంబర్‌లో భూములున్న వారందరికీ కలిపి ఒకే పాసు పుస్తకాన్ని జారీ చేస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో గ్రామాల్లో గందరగోళం నెలకొంటోంది. భూ యజమానులు ఎవరో అర్ధంకాని అయోమయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తమకిచ్చిన పాసు పుస్తకాల్లో ఇతరుల పేర్లు ఎందుకుంటున్నాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనికి జవాబియ్యాల్సిన అధికారులు పెదవివిప్పడం లేదు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురంలో మారెళ్ల మారుతీరావుకు వారసత్వంగా 16 ఎకరాల భూమి వచ్చింది. ఆయనకు అధికారులు జారీ చేసిన పాసుపుసక్తంలో మరో 19 మంది రైతులను ఉమ్మడి వ్యవసాయదారులుగా పేర్కొన్నారు. దీంతో ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో ఆయన ఉన్నారు. టంగుటూరు మండలం మర్లపాడుకు చెందిన ముప్పరాజు సుజాతకు గతేడాది అక్టోబరులో పాసుపుస్తకం మంజూరైంది. ఆమెకు సర్వే నెంబరు 294లో 11.67 ఎకరాలు భూమి ఉంది. కొత్తగా జారీ చేసిన పాసుపుస్తకంలో ఉమ్మడి వ్యవసాయదారులుగా మరో తొమ్మిది మంది రైతుల పేర్లు కూడా నమోదు చేశారు. దీనిపై గందరగోళం నెలకొంది. టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలోని రైతు పమిడి వెంకటరత్నమ్మ ఇచ్చిన పాసుపుస్తకంలో మరో ఏడుగురు వ్యవసాయదారుల పేర్లు కలిపి ఉన్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలే! వీటికి పరిష్కారంచూపాల్సిన అధికారులు మాత్రం 'ఇదే మీ శాశ్వత భూ హక్కు పత్రం' అని చెబుతున్నారు.

                                                                   ఇవీ సందేహాలు...!

ఈ తరహా పాసు పుస్తకాలతో తమకు ప్రయోజనమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు భవిష్యత్తులో రుణాలు తీసుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా ఎలా సాధ్యమవుతుందని అడుగుతుందున్నారు. వీటికి పాసు పుస్తకాల్లో పేర్లున్న వారందరూ సంతకాలు చేయాలంటే అమ్ముకునే హక్కునే తమనుండి తీసేసినట్టవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

                                                                       హద్దులు మార్చాలంటే ...

భవిష్యత్తులో హద్దులు మార్చుకునేందుకు కూడా వీలు లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ కూడా తాజాగా చర్చనీయాంశమైంది. గతేడాది అక్టోబర్‌లో జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం కేవలం సివిల్‌ కోర్టు డిక్రీ ద్వారా మాత్రమే హద్దులు మార్చడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చేస్తున్న సర్వేలో హద్దులు ఖరారు చేసి పాసుపుస్తకం ఒక సారి జారీ చేస్తే వివాదం తలెత్తిన ప్రతిసారీ కోర్టుకు వెళ్లాల్సివస్తుంది. ఇది పరిస్థితులను మరింత క్లిప్టం చేస్తుందన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.

                                                                        ఎన్ని గ్రామాల్లో ...

రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల గ్రామాల్లో భూరికార్డుల ఆధునీకరణ కార్యక్రమం జరగాల్సి ఉంది. పైలట్‌ ప్రాజెక్టు కింద 1,845 గ్రామాలను ఎంపిక చేశారు. ప్రకాశం జిల్లాలో 862 గ్రామాలు ఎంపిక చేశారు. ఇప్పటి వరకూ 48 గ్రామాల్లో సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ గ్రామాల్లో రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలను జారీ చేస్తున్నారు. వీటిలో అనేక తప్పిదాలు దొర్లుతున్నాయి. రైతులకు ఏ తరహా సమస్యలతోనైతే భూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయో వాటికి ఇప్పుడు కూడా పరిష్కారం చూపలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.