Nov 14,2023 10:55
  • లబ్ధిదారుల ఎంపికలో కొరవడిన పారదర్శకత
  • భూ పంపిణీ వాయిదా ?

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : భూమిలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వ్యవసాయ భూముల పంపిణీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అస్మదీయులకే భూములను కట్టబెట్టనున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమం ప్రకారం రేపు (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా భూ పంపిణీ కార్యక్రమం జరగాల్సిఉంది. దీనికి సంబంధించి జిల్లాల్లో అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశాలు జరిగిన దాఖలాలు లేవు. దరఖాస్తులు కోరుతూ బహిరంగ ప్రకటన కూడా విడుదల చేయలేదని అంటున్నారు. అయినా, లబ్ధిదారుల జాబితా సిద్ధం కావడం, రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల మందికి దాదాపుగా 52 వేల ఎకరాలు పంపణీ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం కావడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. దీంతో ఈ కసరత్తు జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బుధవారం ఈ కార్యక్రమం జరగాల్సిఉండగా. సోమవారం రాత్రి పది గంటల వరకు కూడా దీనికి సంబంధంచిన షెడ్యూల్‌ విడుదల కాలేదు. దీంతో ఈ కార్యక్రమం వాయిదా పడిఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

                                                          అసైన్‌మెంట్‌ కమిటీలు ఉన్నట్లా? లేనట్లా?

పేదలకు భూములు పంపిణీ చేయాలంటే తొలుత నియోజకవర్గ స్ధాయిలో స్ధానిక ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ కేంద్రాల్లో అసైన్‌మెంట్‌ కమిటీలు నిర్వహించేవారు. ఆ సమావేశంలో లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. ఇటీవల కాలంలో ఎక్కడా నియోజకవర్గస్ధాయిలో అసైన్‌మెంట్‌ కమిటీలు నిర్వహించిన దాఖలాల్లేవు. ఇటీవల కాలంలో నియోజకవర్గ స్దాయి అసైన్‌మెంట్‌ కమిటీలు ఉన్నాయో లేవో అర్ధం కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. 2018 మే 15న ప్రభుత్వ భూములు, మిగులు భూములు కేటాయింపు, భూ సంస్కరణలు ( వ్యవసాయ హోల్డింగ్‌పై సీలింగ్‌ చట్టం) 1973 కింద జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా స్ధాయి అసైన్‌మెంట్‌ రివ్యూ కమిటీల పునర్వ్యవస్ధీకరణ చేస్తూ జీఓ ఎంఎస్‌ నెంబరు 250ని ప్రభుత్వం విడుదల చేసింది. జీఓలో పేర్కొన్న ప్రకారం జిల్లా ఇన్‌చార్జీ మంత్రి ఛైర్మన్‌గా, సంబంధిత జిల్లా మంత్రులు సభ్యులుగా, జాయింట్‌ కలెక్టర్‌ మెంబర్‌ కన్వీనరుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా సంబంధిత నియోజకవర్గాన్ని ఎంచుకున్న ఎమ్మెల్సీలు, స్దానిక శాసనసభ్యులులు వ్యవహరిస్తారు. సభ్యులుగా ఆర్‌ఢిఓగా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25లక్షల ఎకరాల వరకు ప్రభుత్వ భూములున్నట్లు కోనేరు రంగారావు కమిటీ పేర్కొంది. నిరుపేదలకు భూములు పంపిణీ చేయాలంటే నిజమైన లబ్ధిదారులను గ్రామ పంచాయతీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేసి, మండల స్ధాయికి పంపాల్సి ఉంటుంది. అనంతరం నియోజకవర్గ స్ధాయి అసైన్‌మెంట్‌ కమిటీ అప్రూవల్‌ కోసం పంపాలి. కానీ, తాజా కార్యక్రమంలో అలా జరగడం లేదు.
 

                                                          లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఏది ?

లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారనే విషయం మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. పారదర్శకంగా ఎంపిక చేయాల్సిన జాబితా గుట్టు చప్పుడు కాకుండా స్ధానిక ఎమ్మెల్యే సూచించిన పేర్లు, స్పందనలో వచ్చిన అర్జీల్లో కొన్ని ఎంపిక (సెలెక్టెడ్‌) చేసుకుని జాబితా అఫ్రూవల్‌ చేసుకున్నట్లు తెలిసింది.