
- అదాని - వేదాంత రహస్య ఒప్పందం
- జింక్ భూమి అప్పగింతకు కేంద్రం అంగీకారం
- ఒసిసిఆర్‌పి నివేదికలో వెల్లడి
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ట్రంలోని తీర ప్రాంత భూములపై కన్నేసిన అదాని సంస్థ మరింతగా తెగబడుతోంది. విశాఖపట్నంలోని జింక్ పరిశ్రమకు చెందిన వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను ఆ సంస్థ దక్కించుకోనున్నట్లు తెలిసింది. ఈ మేరకు జింక్ పరిశ్రమలో కీలక భాగస్వామిగా ఉన్న వేదాంత సంస్థతో ఆ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం తాజాగా బట్టబయలైంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఒసిసిఆర్‌పి) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ రంగలో జింక్ పరిశ్రమ ఏర్పాటు కోసం స్థానిక రైతులు నామమత్రపు ధరకు ఈ ప్రాంతంలో భూములు ఇచ్చారు. తమ పిల్లలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశించారు. కానీ, ఉపాధి అవకాశాలు రాకపోగా, కేంద్ర ప్రభుత్వం అనుసరించిన నూతన సరళీకరణ ఆర్థిక విధానాల కారణంగా ఆ భూములు వేదాంత సంస్థ పరమైనాయి. ఇప్పుడు అవే భూములను దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అదాని చేజిక్కించుకోనున్నట్లు ఒసిసిఆర్‌పి నివేదిక వెల్లడించింది. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ డీల్‌కు నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుతం గ్రీన్ సిగల్ ఇచ్చినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.
ఎన్ని ఎకరాలు....?
1974 వ సంవత్సరంలో ప్రభుత్వ రంగంలో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఏర్పాటు కోసం మింది, నక్కవానిపాలెం, చుక్కవానిపాలెం, ములగాడ గ్రామాల ప్రాంతాల రైతుల నుండి ప్రభుత్వం భూమిని సేకరించింది. ఎకరా 850 రూపాయల చొప్పున 350 ఎకరాలను అప్పట్లో రైతులు ఇచ్చారు. 2002లో కేంద్రంలోని వాజ్‌పేయి, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వాలు జింక్ పరిశ్రమను దెబ్బతీసే చర్యలకు ఉపక్రమించాయి. ఆ ఏడాదే ఈ పరిశ్రమలోని అధికశాతం వాటాను వేదాంత సంస్థ దక్కించుకుంది. వేదాంత గ్రూప్‌నకు ప్రస్తుతం జింక్ పరిశ్రమలో 64.92 శాతం స్టేక్ ఉంది. 29.54 శాతం ప్రభుత్వ వాటాగా ఉంది. తాజా ఒప్పందంలో భాగంగా రైతుల నుండి సేకరించిన 350 ఎకరాల భూమి అదాని పరం కానుంది. గాజువాకకు సమీపంలోనే ఉన్న ఈ భూములు ప్రస్తుతం ఎకరాకు 10 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. ఒప్పందంలో భాగంగా అదాని ఎంత రేటు చెల్లించనుందన్న విషయం వెలుగులోకి రాలేదు. వేదాంతకు చెందిన మొత్తం వాటాలను కూడా అదాని చేజిక్కించుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆ తరువాత కేంద్ర ప్రభుత్వానికి మిగిలి ఉన్న నామమాత్రపు వాటాను దక్కించుకోవడం అదాని గ్రూపునకు కష్టం కాదన్న సంగతి తెలిసిందే. గంగవరం పోర్టులో తనకున్న పదిశాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం అదానికోసం వదులుకున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఇదే మాదిరి తప్పుకునే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే, స్థానిక రైతాంగం భవిష్యత్తుపై గంపెడు ఆశతో ప్రభుత్వానికి ఇచ్చిన భూములు, వారి ఆశలు నెరవేరకపోగా చివరకు కార్పొరేట్ల పరం కానున్నాయి.
విశాఖ వాసులకు మసే...!
ఈ భూములను బొగ్గు స్టాక్ యార్డుగా మార్చే ఆలోచనలో అదాని గ్రూపు ఉన్నట్లు సమాచారం. అదాని గంగవరం పోర్టుకు పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్న బొగ్గును ఇక్కడ నిలువ చేసి, ఆ తరువాత దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆమోద ముద్ర వేసినట్లు చెబుతున్నారు. అదే జరిగితే మింది, నక్కవానిపాలెం, ములగాడ, గాజువాక సహా మర్రిపాలెం, విశాఖ నగరం బొగ్గు మసితోనూ, కాలుష్యంతోనూ నిండిపోనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర సర్కారు మౌనం !
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో పెదవివిప్పని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జింక్ భూము ల విషయంలోనూ అదే వ్యూహాన్ని పాటిస్తోంది. స్థానికంగా చర్చనీయాంశమైనప్పటికీ ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలతో పాటు, విశాఖ ప్రాంతంలోని అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు స్పందిచంచడం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా మౌనముద్ర వేసింది. ప్రజలు మాత్రం భూములను అదానికి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు.