Aug 04,2023 08:47

'భూ సమీకరణ పథకం కింద సేకరించిన భూములను వివిధ సంస్థలకు కేటయించడంపై అమరావతి ల్యాండ్‌ అలాట్మెంట్‌ రూల్స్‌ 2017లో వచ్చాయి. వీటి ప్రకారం భూ కేటాయింపులకు ముందు పబ్లిక్‌ నోటీసు ఇవ్వాలి. సిఆర్‌డిఎ నిర్ణయించిన ధర మేరకు పూర్తి చెల్లింపులు జరిగాక 30 రోజుల్లోగా కొనుగోలుదారు ఒప్పందం చేసుకోవాలి. దీని ప్రకారం భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.345 కోట్లు సిఆర్‌డిఎకు చెల్లించాల్సివుంది. జూన్‌ 23 వరకు ఎలాంటి సొమ్ము చెల్లించలేదు. సిఆర్‌డిఎ కమిషనరు సొమ్ము చెల్లింపు గడువును పొడిగిస్తున్నారు. నిర్మాణాలకు తగిన అనుమతులు తీసుకున్నట్లు ఆధారాలు చూపించలేదు. డబ్బులు చెల్లించకుండా, ఒప్పందాలు చేసుకోకుండా, నిర్మాణాలకు ఎటువంటి అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించడం నిబంధనలకు వ్యతిరేకం. దీనిపై కూడా పూర్తిగా విచారణ చేయాల్సి వుంది. ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,081 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సిఆర్‌డిఎ నుంచి స్థలం కొనుగోలుకు రాష్ట్రం రూ.345 కోట్లు ఖర్చు చేస్తోంది. రెండూ కలిపితే రూ.1,426 కోట్లకు ఖర్చు చేరుతుంది. ఇళ్ల పట్టాల కేటాయింపులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో రూ.1,426 కోట్ల ఖర్చు చేశాక తీర్పు వ్యతిరేకంగా వస్తే అంత భారీ మొత్తంలో చేసిన ప్రజాధనాన్ని తిరిగి రాబట్టలేం.' అని ఉత్తర్వుల్లో పేర్కొంది. 'అమరావతి అభివృద్ధి కోసం ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చట్టంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రాంతాల వారికి కూడా రాజధాని ప్రాంతంలో స్థలాలు ఇచ్చి నిర్మాణం చేస్తామంటోంది. దీనికి చట్టం అనుమతిస్తుందో లేదో అనే అంశంపై సమగ్ర విచారణ జరగాల్సి వుంది' అని ధర్మాసనం అభిప్రాయపడింది. 'అమరావతి రైతుల హక్కులు, మాస్టర్‌ ప్లాన్‌ మార్పులు వంటి వివాదాలపై తుది తీర్పులు రావాల్సి వుంది. ఒకదానితో మరొకటి ముడిపడిన అంశాలివి. ఈ పరిస్థితుల్లోనే స్టే ఇవ్వడమే మా ముందున్న మార్గం. ఇతర అంశాలపై ఇరుపక్షాల వాదనలు చెప్పినప్పటికీ వాటి జోలికి వెళ్లలేదు' అని ధర్మాసనం పేర్కొంది.