
చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌కు సర్వం సిద్ధం
కొనసాగుతున్న తనిఖీలు
రేపు అపురూప ఘట్టం ఆవిష్కరణకు ఇస్రో ఏర్పాట్లు
బెంగళూరు : జాబిల్లి ఉపరితలంపై మన అంతరిక్ష నౌక చంద్రయాన్-3 అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. అపురూపమైన ఈ ఘట్టం ఆవిష్కరించే క్రమంలో చివరి క్షణాలు అత్యంత కీలకమైనవని ఇస్రో అధికారులు చెబుతున్నారు. దాన్ని '17 నిమిషాల టెర్రర్'గా అభివర్ణిస్తున్నారు. ఈ చారిత్రక క్షణాల కోసం యావత్ భారతీయులు ఉద్విగంగా ఎదురుచూస్తున్నారు. చంద్రుడిపై పరిశోధనలకు రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ఆ అపరూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో సిద్ధమైంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడిపై నిర్దేశిత ప్రదేశం (సాఫ్ట్ ల్యాండింగ్)లో ల్యాండ్ అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్‌ను నిరంతర తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ప్రదేశంలో ల్యాండర్ దిగేందుకు చంద్రునిపై సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో తెలిపింది. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం సుమారు 5:45 గంటల తర్వాత ఈ ప్రక్రియ మొదలుకానున్నట్లు అంచనా వేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ పూర్తిగా స్వతంత్రమైనది. సరైన ఎత్తులో, సరైన సమయంలో, సరిపడా ఇంధనాన్ని వినియోగించుకుని ల్యాండర్ తన ఇంజన్లను మండించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సురక్షిత ల్యాండింగ్ కోసం సరైన ప్రదేశాన్ని స్కాన్ చేసుకుంటుంది. ఇదంతా ల్యాండర్ స్వయంగా చేసుకోవాల్సిందే.
- ల్యాండింగ్ ప్రక్రియ ఇలా....
- ల్యాండర్ మాడ్యూల్‌లో పేరామీటర్లు అన్నింటినీ తనిఖీ చేసి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలో నిర్దేశించుకున్న తర్వాత బెంగళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ నుంచి ఇస్రో సంబంధిత కమాండ్లను ల్యాండర్ మాడ్యూల్‌కు అప్‌లోడ్ చేస్తుంది. షెడ్యూల్డ్ ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు ఇది జరుగుతుంది.
- సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశలోకి అడుగుపెడుతుంది. ఇక్కడి నుంచి చివరి 17 నిమిషాలు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతాయి.
- జాబిల్లి ఉపరితలానికి చేరువయ్యేందుకు ల్యాండర్ తన నాలుగు ఇంజిన్లను మండించుకుంటుంది. ఆ తర్వాత క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంటుంది. ల్యాండర్ కుప్పకూలకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. జాబిల్లి గురుత్వాకర్షణకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
- జాబిల్లి ఉపరితలానికి వెళ్లే సమయంలో ల్యాండర్ వేగం సెకనుకు 1.68 కిలోమీటర్లుగా ఉంటుంది. ఒక విమానం వేగం కంటే ఇది పది రెట్లు ఎక్కువ.
- జాబిల్లి ఉపరితలానికి 6.8 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ల్యాండర్ తన రెండు ఇంజిన్లను ఆఫ్ చేసి మరో రెండు ఇంజిన్లనే ఉపయోగించుకుని వేగాన్ని తగ్గించుకుంటుంది. రివర్స్ థ్రస్ట్‌తో మరింత కిందకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది.
- అప్పటికీ ల్యాండర్ ఇంకా జాబిల్లి ఉపరితలానికి సమాంతరంగానే ఉంటుంది. దీన్ని 'రఫ్ బ్రేకింగ్ దశ' అంటారు. ఇదంతా 11 నిమిషాల పాటు సాగుతుంది.
- ఆ తర్వాత ల్యాండర్ 'ఫైన్ బ్రేకింగ్ దశ'లోకి అడుగుపెడుతుంది. ఇక్కడ చంద్రయాన్-3 అంతరిక్ష నౌక 90 డిగ్రీలు వంపు తిరుగుతుంది. అప్పుడు చంద్రుని ఉపరితలంపై నిలువు స్థానానికి వస్తుంది. గతంలో ఇక్కడే చంద్రయాన్-2 నియంత్రణ కోల్పోయి క్రాష్ అయ్యింది.
- అలా క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ల్యాండర్ నిలువు, అడ్డం వేగాలు సున్నాకు తగ్గుతాయి. అప్పుడు ల్యాండర్ అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తుంది.
- ఆ తర్వాత ల్యాండర్ మరింత కిందకు దిగి 150 మీటర్ల ఎత్తుకు వస్తుంది. అప్పుడు మరోసారి ల్యాండింగ్ కోసం ఎగుడు దిగుళ్లు, బండరాళ్లు లేని ప్రదేశం కోసం వెతుకుతుంది.
- అన్నీ అనుకూలంగా కన్పిస్తే రెండు ఇంజిన్ల సాయంతో ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెడుతుంది. అప్పుడు దాని కాళ్లు సెకనుకు మూడు మీటర్ల వేగంతో చంద్రుని ఉపరితలాన్ని తాకుతాయి.
- ల్యాండర్ కాళ్లకు అమర్చిన సెన్సార్లు.. జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజిన్లు ఆఫ్ అవుతాయి. ఆ 17 నిమిషాల టెన్షన్‌కు తెరపడి ప్రయోగం విజయవంతమవుతుంది.
ల్యాండర్ జాబిల్లిపై దిగిన తర్వాత దాని ఒక తలుపు తెరుచుకుంటుంది. అందులో నుంచి రోవర్ జారుకుంటూ కిందకు వస్తుంది. ఆ తర్వాత ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తుంది. ల్యాండర్, రోవర్ మొత్తం 14 రోజులపాటు చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తాయని ఇస్రో వెల్లడించింది.
- 27కి సాఫ్ట్ ల్యాండింగ్ వాయిదా పడొచ్చు !
ఒకపక్క చంద్రునిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌కి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతుండగా, అవసరమైతే ఈ ప్రక్రియను 27వ తేదీకి వాయిదా వేయవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ల్యాండర్ మాడ్యూల్‌కి సంబంధించిన పేరామీటర్లలో ఏవైనా అసాధారణంగా వున్నాయని తేలితే ఈ ప్రక్రియను వాయిదా వేస్తామన్నారు.
ప్రస్తుతం అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించడంపైనే శాస్త్రవేత్తల దృష్టి కేంద్రీకృతమై వుందని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశారు తెలిపారు. ''ఆ వేగాన్ని మనం నియంత్రించలేకపోతే క్రాష్ ల్యాండింగ్ అయేందుకు అవకాశం వుంటుంది. అందువల్ల టెలిమెట్రీ సిగల్స్‌ను విశ్లేషించి, చంద్రునిపై పరిస్థితులను పరిశీలించి ఎక్కడ ఏది సరిగా లేకపోయినా ల్యాండింగ్ ప్రకియను 27న నిర్వహించేందుకు సిద్ధమవుతామని చెప్పారు.
ఒకవేళ 27కే ల్యాండింగ్ ప్రక్రియ చేపట్టాల్సి వస్తే అప్పుడు ప్రధాన ల్యాండింగ్ ప్రదేశం నుండి 400కిలోమీటర్ల దూరంలో ల్యాండర్ దిగేందుకు మరో ప్రదేశాన్ని ఎంపిక చేశామని కూడా చెప్పారు.