Nov 06,2023 11:29
  • బిజెపితో ప్రజలకు నష్టం
  • పరవాడ రాంకీ కాలుష్యంతో ప్రజలకు ముప్పు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో/కాకినాడ ప్రతినిధి : దేశంలోని బ్యాంకులు, రైల్వేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, గాలి, నీరు.. ఇలా దేశం మొత్తాన్ని అదానీ. అంబానీ వంటి కార్పొరేట్లకు అమ్మే హక్కు ప్రధాని మోడీకి ఎవరిచ్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం ప్రశ్నించారు. బిజెపితో ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. సిపిఎం ఆధ్వర్యాన జరుగుతున్న ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర ఆదివారం అనకాపల్లి జిల్లా లంకెలపాలెంలో ప్రారంభమై పరవాడ, అచ్యుతాపురం, అనకాపల్లి, ఎస్‌.రాయవరం, మీదుగా కాకినాడ జిల్లా తుని, పిఠాపురం, కాకినాడకు చేరుకుంది. యాత్రా బృందానికి స్థానికంగా ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న ఫార్మా కాలుష్యంపైనా, కనీస సదుపాయాలలేమిపైనా, విద్యుత్‌ భారాలపైనా వినతులు సమర్పించారు. యాత్ర ఆద్యంతం ఆశాలు, అంగన్‌వాడీలు, విఒఎలు, మధ్యాహ్న భోజన కార్మికులు, జీడి పిక్కల పరిశ్రమ కార్మికులు, ఇతర స్కీం వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సభల్లో కె.లోకనాథం మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలో మోడీ పాలన సాగుతోందన్నారు. రాష్ట్రాలు, ప్రాంతాల మధ్యే కాకుండా మత సామరస్యంతో జీవించే మనుషుల మధ్య కూడా చిచ్చుపెడుతోందని తెలిపారు.
          విభజన హామీలను నెరవేర్చకున్నా, నిత్యావసర సరుకుల ధరలను పెంచేస్తున్నా రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. పరవాడ రాంకీ ఫార్మా కంపెనీ కాలుష్యంతో స్థానిక ప్రజల ఉపాధికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. కాలుష్యంతో పరవాడలోని పెదచెరువు ఎలా నాచు పట్టికుపోయిందో వివరించారు. పరవాడ వాసులు కాలుష్యంతో జీవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా? అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాకినాడ వంటి నగరాల్లో పట్టణ సంస్కరణలను అమలు చేస్తూ.. చెత్త, ఇంటి పన్నులు భారీగా పెంచి ప్రజలపై మోయలేని భారాలను మోపుతున్నాయన్నారు. కాకినాడ నగరంలో పాలకులు భూ కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. జూనియర్‌ కళాశాల స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసమే యాత్రలు చేపట్టినట్లు తెలిపారు. లంకెలపాలెం జంక్షన్‌ వద్ద సభలో పార్టీ సీనియర్‌ నాయకులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ రాంకీపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులందరికీ రూ.లక్షలు లంచాలు కవర్లలో అందడమే కారణమని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ.. కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తోన్న బిజెపితో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు జతకట్టడం సరికాదన్నారు. బిజెపి అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. యాత్రలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఎవి.నాగేశ్వరరావు, కె.ధనలక్ష్మి, బి.ప్రభావతి, హరిబాబు, అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు, డి.వెంకన్న, ఎం.అప్పలరాజు, సిపిఎం కాకినాడ జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, సీనియర్‌ నాయకులు దువ్వాశేషబాబ్జి, జి.బేబిరాణి తదితరులు పాల్గొన్నారు.