Apr 24,2023 08:08

నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో
అది ఈ రోజే చెయ్యి
రేపు ఎప్పుడూ మనది కాకపోవొచ్చు
తప్పకుండా మనకు చెప్పకుండా
మన అనుమతి లేకుండా
మనను తీసుకుపోయే క్షణమొకటి వస్తుంది
అప్పుడు నువ్వెంత నొచ్చుకున్నా.. గింజుకున్నా
కాలధర్మంలో కలిసి పోవాల్సిందే !

రేపటి కోసం
ఈ రోజునే నీ తన్లాట చూస్తుంటే
మనిషి ఇంతేనేమోననిపిస్తుంది
కాస్త వాస్తవిక స్ప ృహలోకి రా ...

ద్వేషాలు మోసాలు ప్రతీకారాలు వీడు
వీలైనంత విశాలంగా ప్రేమించు
నువ్వు లేకున్నా నీ మాట.. నీ చేత
బతికే వుంటుంది తెలుసుకో...!

నిన్ను నువ్వు నిత్యం అప్డేట్‌ చేసుకోకుంటే...
ఆసాంతం వెనకబడతావ్‌
గిర్రున తిరుగుతున్న వర్తమాన పేజీల నుంచి
నిర్దాక్షిణ్యంగా నీ అస్తిత్వ వాక్యం తొలగించబడుతుంది!

నువ్వు నీ బాధల నడుమ
బందీ అయివున్నందుకు నిన్ను
అడుగడుగునా వేధించే వాళ్ళు
బాధించే వాళ్ళు కోకొల్లలుంటారు
అన్నీ లెక్క కట్టుకోకు తలలో మూట గట్టుకోకు
కదులు ముందుకు చైతన్యంతో ...
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో
నువ్వెంత బిజీగా ఉన్నా సరే..
ఇరుగుతోనో... పొరుగుతోనో..
స్నేహితులతోనో.. సన్నిహితులతోనో..
రోజూ ఓ పిడికెడు ప్రేమను పోగేసుకో..

నువ్వు మదినిండా ఏడ్వటమైనా
హృది నిండా నవ్వటమైనా...
బతికున్నప్పుడే చెయ్యగలవ్‌
మంచో... చెడో.. కష్టమో...నిష్ఠూరమో...
నువ్విప్పటివరకూ
బతికున్నందుకు శుభాకాంక్షలు..!
 

- డా.కటుకోఝ్వల రమేష్‌
99490 83327