Jun 04,2023 13:31

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : ఖరీఫ్‌ సాగు చేపట్టేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సైతం ఈనెల 1వ తేదీ నుంచి కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నేటికీ కాలువల పూడికతీత తీయకపోవడంతో సాగునీటి సరఫరాకు ఆటంకం కలుగుతుందని పలువురు రైతులు అంటున్నారు. మండపేట, తాపేశ్వరం సెక్షన్‌ పరిధిలోని మురమండ, ఏడిద, వెదురుపాక, తాపేశ్వరం, కెఎస్‌ఎస్‌, తదితర ఛానళ్లు ఉండగా 13 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. ఈ సెక్షన్‌ పరిధిలోనే 15,740 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 1, 2 చిన్న కాలువలు మినహా ఏ కాలువలోను పూడికతీత పనులు జరగకపోవడంతో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని, నీటి ప్రవాహంలో గుర్రపు డెక్క, వ్యర్ధాలు పొలాల్లో కొట్టుకొని వచ్చి పంటలకు నష్టం కలుగుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించాలని రైతులు కోరుతున్నారు. దీనిపై ఇరిగేషన్‌ జెఇ నాగరాజును వివరణ కోరగా గుర్రపుడెక్క తదితర వ్యర్థాల తొలగింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.