Nov 10,2023 08:54
  • భారీగా పోలీసుల మోహరింపు
  • మత్స్యకారులకు బెదిరింపులు
  • వైసిపి, టిడిపి మౌనం

ప్రజాశక్తి - అనకాపల్లి ప్రతినిధి, నక్కపల్లి విలేకరి : కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణల కోసం దాదాపు రెండు సంవత్సరాలుగా మత్స్యకారులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. పేదల పక్షాన ఉంటామని అట్టహాసంగా చెబుతున్న ప్రభుత్వ పెద్దలు ఆచరణలో కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నారనడానికి హెటిరో డ్రగ్స్‌ పనులు మళ్లీ ప్రారంభమైన తీరే నిదర్శనం. మత్య్యకారులను తీవ్ర స్థాయిలో బెదిరించారు. విషయం బయటకు పొక్కకుండా భారీ ఎత్తున పోలీసులను మోహరించి నాలుగు రోజుల క్రితం పనులు ప్రారంభించేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక వైసిపి, టిడిపి నేతలు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. ఈ ప్రాంతాన్ని గురువారం పరిశీలించిన ప్రజాశక్తికి 2021 డిసెంబర్‌ 1 నుంచి మత్స్యకారులు నిర్వహిస్తున్న ధర్నా శిబిరంలో పోలీసులే కనిపించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో హెటిరో డ్రగ్స్‌ ప్రభావిత గ్రామాలు రాజయ్యపేట, బోయపాడు, పెదతీనార్ల, దొండవాక, చినతీనార్ల మత్స్యకారులు హెటిరో డ్రగ్స్‌ రెండో పైపులైన్‌ పనులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్‌జిటిలో వేసిన కేసు విచారణ ఒకవైపు జరుగుతుండగానే అనుమతులన్నీ వచ్చేశాయని చెబుతూ రెండో పైపు లైన్‌ పనులను యాజమాన్యం ప్రారంభించింది. అనుమతులకు సంబంధించిన ఒక్క కాగితాన్ని కూడా తమకు చూపలేదని మత్స్యకారులు చెబుతున్నారు. అదేసమయంలో పోలీసులు హెటిరో తరపున మాట్లాడుతూ, తమను బెదిరిస్తున్నారని వారు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ, అటవీశాఖ భూముల్లో ఆ శాఖల అనుమతుల్లేకుండానే రెండో పైప్‌లైన్‌ను హెటిరో యాజమాన్యం వేస్తుందన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.
 

                                                                      నిబంధనలకు పాతర

హెటిరో యాజమ్న్యాం మొదటి నుండి నిబంధనలను పట్టించుకోవడం లేదు. సిఆర్‌జెడ్‌లో ఎటువంటి నిర్మాణాలూ చేపట్టకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటికీ మూడు డీశాలినేషన్‌ ప్లాంట్లను యాజమాన్యం నిర్మించింది. హెటిరో ఉల్లంఘనలను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) ఎత్తిచూపింది. ఎన్‌జిటి నియమించిన జాయింట్‌ కమిటీ తన నివేదికలో హెటిరో యాజమాన్యం పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు పేర్కొనడం తో పాటు రూ.6.94 కోట్లు అపరాధ రుసుము విధించాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు అమలైన దాఖలా కనిపించడం లేదు. హెటిరో గ్రూపు చైర్మన్‌ పార్ధసారథి రెడ్డి బిఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

                                                                          సిపిఎం ఫిర్యాదు

రెండో పైపులైన్‌ పనులు ప్రారంభించడంపై సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు కలెక్టర్‌కు, ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ పనుల పరిశీలనకు రెవెన్యూ అధికారులతో కమిటీని వేస్తున్నట్లు తెలిపారు. పైపులైన్‌ పనులను ఆ కమిటీ పరిశీలించినా ఫలితం కనిపించలేదు.