
ప్రజాశక్తి-కలెక్టరేట్ :మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వివిధ పనులు పురోగతిలో ఉన్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుండి శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో పోర్టు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్, పోర్టు, రెవెన్యూ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గని మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనుల గురించి సిఎస్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైల్, రోడ్ కనెక్టివిటీకి సంబంధించి మూడు దశల్లో చేపట్టే రహదారి అభివృద్ధి పనులకు మొదటి దశలో బీచ్ రోడ్డు నుండి బ్రేక్ వాటర్ వరకు మెటీరియల్ తరలించేందుకు తాత్కాలిక రహదారి పనులు పూర్తయినట్లు చెప్పారు. రెండవ, మూడవ దశల్లో రహదారి అభివఅద్ధి పనులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. సౌత్ బ్రేక్ వాటర్ పనులు 280 మీటర్ల వరకు పూర్తయ్యాయని, నార్త్ బ్రేక్ వాటర్ పనులు వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. టర్నింగ్ సర్కిల్ ఏరియా వద్ద ల్యాండ్ సైడ్ డ్రెడ్ జింగ్ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్‌డిఒ ఐ.కిషోర్, మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇడి విద్యాశంకర్, ఎఇ కె.మహేష్, తదితరులు పాల్గొన్నారు.