
రెసిడెంట్స్ అసోసియేషన్లతో టిడ్కో ఇళ్ల నిర్వహణ
సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :నగరాలు, పట్టణాల్లో సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై దృష్టి సారించాలన్నారు. పట్టణాల్లో ఇప్పటికే కొనసాగుతున్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణను రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా చేపట్టాలని సూచించారు. జగనన్న కాలనీల్లోనూ నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. నగరాల్లో పెద్దయెత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్, సీవరేజ్ ట్రీట్‌మెంటు ప్లాంటు (ఎస్‌టిపి) నిర్వహణ, పారిశుధ్యం కోసం అత్యాధునిక యంత్రాలు, తదితరాలను వివిధ ప్రాజెక్టుల కింద తీసుకొస్తున్నామని తెలిపారు. వాటి నిర్వహణ కోసం సాంకేతిక నైపుణ్యం ఉన్న మానవ వనరుల అభివృద్ధి కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్, ఐటిఐ విద్యార్థుల్లో పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం అవసరమయ్యే సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఒపి) ఉండాలన్నారు. అలాగే నీటి సంరక్షణపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వరదల వల్ల నెల్లూరు మునిగిపోయే పరిస్థితులు రాకుండా రక్షణగోడ నిర్మాణంపై దృష్టి సారించాలని తెలిపారు. రాజమండ్రిలో కంబాల చెరువు, హేవలాక్ బ్రిడ్జి సుందరీకరణ పనులతోపాటు ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని సిఎం సూచించారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం, కన్వెన్షన్ సెంటర్ పనులు పూర్తి చేయాలని, పార్కుల్లో గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కాల్వలు, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. విజయవాడ, గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే మార్గం వెంబడి సుందరీకరణ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, కృష్ణానది రక్షణగోడ వెంట కూడా సుందరీకరణ చేయాలని ఆదేశించారు.
- విశాఖపై ప్రత్యేక దృష్టి
విశాఖ నగరంలో నాలుగేళ్ల కాలంలో రూ.3,529 కోట్ల విలువైన రోడ్లు, డ్రెయిన్లు, నీటి సరఫరా వీధిలైట్లు, పార్కులు, వాటర్‌బాడీలు, సుందరీకరణ, మురుగునీటి శుద్ధి, వివిధ భవనాల నిర్మాణం, పౌరులకు సేవల కోసం ఖర్చు చేసినట్లు అధికారులు సిఎం దృష్టికి తీసుకెళ్లారు. ముడసర్లోవ పార్కు అభివృద్ధి, ఆర్‌టిసి కాంప్లెక్స్ సమీపంలో వాణిజ్య భవన సదుపాయం, మల్టీలెవల్ కారు పార్కింగు, భీమిలి, గాజువాక, అనకాపల్లిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. దీనిపై సిఎం మాట్లాడుతూ.. రానురానూ జనాభా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.