
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలో గురువారం జరిగిన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి సమావేశంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న రూ.17,414 కోట్ల అడహాక్ నిధులు విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. పోలవరం పనుల పురోగతి, సమస్యలపై సమీక్షించామని, ప్రాజెక్టు వేగంగా పూర్తికావాలన్న లక్ష్యంతో ఈ సమావేశంలో సమీక్షించామని జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పనులను కూడా పూర్తిచేస్తున్నట్లు ఇఎన్‌సి నారాయణరెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, సలహాదారు వెదిరే శ్రీరామ్, ఇఎన్‌సి నారాయణరెడ్డి, సిడబ్ల్యుసి అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పాల్గొన్నారు.