Jul 31,2023 07:35

దేశమంటే మూకలని మరోసారి రుజువైంది
మణిపురమా, మన్నించు తల్లీ !
తోకలూపుతున్న మూకల్ని కన్నది
ఈ గర్భమేనా?
పశ్చాత్తాపం కలుగుతున్నది !

ఈ దేహమెప్పుడూ ఓ ప్రయోగశాలే
ఆకలేసినప్పుడు పీక్కుతున్నదీ
కోపమొచ్చినప్పుడు మదపుటేనుగులా మీద కూర్చుని
పిడిగుద్దులతో తునాతునాకలు చేస్తున్నదీ
ఈ పేగుల నుంచి తెగిపడ్డ వాళ్ళేగా ...

మీసాలు మొలిచిన చేతులు
వికృతంగా అంగాంగం తడిమింది
పసి డొక్కలకి పాలు తాపిన రొమ్ముల్నే
ఒక తరం కోసం మరణశయ్యపై
అలంకరించుకున్న శవమయ్యిందీ మర్మావయవమే
ప్రజాస్వామ్యం రాచరికపు పట్టు పరుపుల మీద
యురేనియం చుక్కల్ని స్కలిస్తున్న పురుష ఋతువిది!

ఇంటికో దేవతా వస్త్రం ధగధగా మెరిసిపోతున్నది
పవిత్ర భారతదేశమా! గుడ్లు మిటకరించే ఉంచు
నడిరోడ్డు మీద నగ్నంగా నిలబడిందెవరో నీకు తెలుసు!
ఇప్పుడంతా బహిరంగమే
న్యాయ దేవత గంతలు విప్పేయండి
న్యాయమూర్తుల్లారా, మీ నల్ల గౌనులు
ఊరవతలకు విసిరి పారెయ్యండి!

నిండు సభలో ఎప్పుడో బట్టలూడదీశారు
ఇప్పుడు కొత్తగా చూడ్డానికేముంది
చోద్యం చూసిందీ
అమ్మల దిసమొలల్నే కదా
ఆ పొత్తి కడుపుల మీద
ఈ జాతిని కన్నప్పుడు వేసిన కుట్లుంటాయి
రెండు కాళ్ళ మధ్యన
విశ్వ మానవుడి పుట్టుక రహస్యాలు
దృశ్యాలు దృశ్యాలుగా కనబడతాయి

జీవ పరిణామ సిద్ధాంతం
ఇప్పుడెలాగూ పగలబడే నవ్వుతున్నది
పీలికలు పీలికలైన మనిషితనాన్ని
కాళ్ళకు కత్తులు కట్టి బరిలోకి దింపారు
తెగనరికిన తలలు దళ్ళకి వేళ్ళాడుతూనే ఉన్నాయి
మా వొంటిపై జెండా శిధిలావస్థలో ఉన్నది
అమ్మలవి పూల గుండెలు కానీ
మీరందులో బాక్సైట్‌ వెతుకుతారు!

అయ్యలారా ...
ఆ కొండల మీద దీన జనుల కోసం
ఏడుపు ముఖం పెట్టకండి
మీ కుటుంబం కోసం మీ ఆడవాళ్ళ కోసం ఏడవండి
మర్చిపోయిన మీ జన్మస్థానం గురించి ఏడవండి
మనిషి జాతినంటినీ ప్రపంచానికిచ్చిన అవయవమే
ఇప్పుడో హింసాస్థలి ...

తల్లుల్లారా, చాలిక
కత్తులు ఒంటి నిండా కప్పుకుని తిరుగుదామిక !
 

- వైష్ణవి శ్రీ
80742 10263