- వెలుగొండ నిర్వాసితుల జాబితా సిద్ధం
- నిధుల కోసం ఎదురుచూపులు
- వచ్చే అక్టోబరులో నీళ్లిస్తామని ప్రకటించిన సిఎం జగన్
ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : 'వచ్చే ఏడాది అక్టోబరులో వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు రైతులకు ఇచ్చాకే ఎన్నికలకు పోతాం' - చీమకుర్తిలో
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన ఇది.
ఈ ప్రక్రియ అనుకున్నట్లుగా జరగాలంటే అన్నింటి కన్నా ముందు నిర్వాసితులకు ప్యాకేజీలు ఇవ్వాలి. ఇళ్లు ఖాళీ చేసేందుకు పరిహారం ఇవ్వాలి. గ్రామాలు ఖాళీ చేశాక మళ్లీ ఉండేందుకు కాలనీలు కావాలి. స్థలాలు కేటాయించాలి. అందులో ఇళ్లు కట్టుకోవాలి. ఇవన్నీ జరగాక వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లివ్వడానికి వీలుంటుంది. ఇంకా 11 నెలలే గడువు ఉంది. సిఎం మాటలు సాకారం కావాలంటే నిర్వాసితులకు చేయాల్సినవి పూర్తి చేయాలి. ఆ దిశగా ఇప్పుడు చర్యలు వేగవంతంగా లేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇంకా ఉద్యోగులకు వేతనాలు కూడా రాలేదనే చర్చ సాగుతోంది. చేసిన అభివృద్ధి పనులకు వందల కోట్ల రూపాయల్లో బిల్లులు బకాయి ఉన్నాయి. అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నిర్వాసితుల వంతయింది.
వెలుగొండ ప్రాజెక్టు కింద 4.20 లక్షల ఎకరాలకు సాగు నీరు, 15 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం. ఇప్పటికే రూ.6 వేల కోట్లకుపైగా దీనికి వెచ్చించారు. డ్యాము పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టులో కీలకమైన రెండు సొరంగాల్లో ఒకటి పూర్తయింది. రెండో సొరంగం మరో మూడు కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉంది.
11 గ్రామాల్లో 7500 మంది నిర్వాసితులు
నిర్వాసితుల సంఖ్యను 2019 అక్టోబరులో తేల్చారు. అప్పటివరకూ 21 ఏళ్లు నిండిన వారిని కూడా పెద్దలుగా పరిగణించి ప్యాకేజీల్లో చేర్చారు. 11 ముంపు గ్రామాల్లో నిర్వాసితులు సుమారు 7,500 మంది తేలారు. ఇళ్లూవాకిళ్లు అన్నీ ఎన్యూమరేషన్ చేశారు. ఒక్కో కుటుంబానికి ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.2 లక్షలు, ప్యాకేజీ కింద రూ.10.50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి స్థలం వద్దనుకుంటే రూ.12.50 లక్షలు ఇస్తామని తెలిపింది. ఇప్పుడు జాబితాలు సిద్ధం చేశారు. నిధులు కేటాయింపులో జాప్యం జరుగుతోంది. మూడేళ్లుగా ప్యాకేజీల కోసం ఎదురుచూపులే మిగిలాయి. ప్యాకేజీలు, ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడి నుంచీ ఖాళీ చేసి వెళ్లేందుకు సిద్ధమని నిర్వాసితులు చెప్తున్నారు.
రూ.1400 కోట్లు ఇస్తేనే గ్రామాలు ఖాళీ చేసేది !
నిర్వాసితులకు పునరావాసం కోసం కాలనీల ఏర్పాటుతోపాటు ప్యాకేజీలు ఇవ్వాలి. బడ్జెట్ కేటాయింపులు అరకొరగా ఉన్నాయి. కేటాయించిన నిధులు కూడా ఒక్కసారిగా రావడం లేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.850 కోట్ల వరకూ వెలుగొండకు కేటాయించారు. పనులు వేగంగా జరగనందున నిధులు కూడా పెద్దగా ఖర్చవ్వలేదు. నిర్వాసితులకు అందాల్సినవే రూ.1400 కోట్ల వరకూ ఉంటాయని అంచనా.
మళ్లీ తెరపైకి మైనర్ తీరిన యువత
2019 అక్టోబరులో ప్రకటించిన ప్యాకేజీలు వెంటనే ఇస్తే సమస్య వచ్చేది కాదు. ప్రస్తుతం 21 సంవత్సరం వచ్చిన వాళ్లకు కూడా ప్యాకేజీలు ఇవ్వాలనే డిమాండ్ ఇప్పుడు ముందుకు వచ్చింది. ఇటువంటి వారి సంఖ్య 11 గ్రామాల్లో 400 మంది వరకూ ఉన్నట్లు అంచనా. దీనిపై ప్రభుత్వం ఇంకా ఏమీ తేల్చలేదు.
కాలనీల్లో కనీసం సౌకర్యాలు అంతంత మాత్రమే
11 గ్రామాల నిర్వాసితులకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీరికి మార్కాపురం, పెద్దారవీడు, కంభం మండలాల్లో ప్లాట్లు వేశారు. పూర్తి స్థాయిలో ఇంకా పట్టాలు ఇవ్వలేదు. గొట్టిపడియ గ్రామ నిర్వాసితులకు స్థలం కేటాయించి ప్లాట్లు వేస్తున్నారు. ఇంకా పట్టాలు ఇవ్వాల్సి ఉంది. తాగునీరు, విద్యుత్తు, గుడి, బడి తదితర కనీస సౌకర్యాలను అన్ని కాలనీల్లోనూ ఏర్పాటు చేయాలి. ఇవి అరకొరగానే జరిగాయి. కాలనీల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తే, గ్రామాలను ఖాళీ చేసి వచ్చేలోపే ఇళ్లు కట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. గ్రామాల్లోనే ఉండి కాలనీల్లో ఇళ్లు కట్టుకునేలా ఏర్పాట్లు చేయాలి. కొత్తగా ఇల్లు కట్టుకోకుండా ఖాళీ చేసినా 7,500 మంది నిర్వాసితులు ఎక్కడ ఉంటారనేదీ ప్రశ్నార్థకమే. పట్టణాల్లో ఇంతమందికి అద్దెకు ఇళ్లు దొరకడం కష్టం. వచ్చే ఏడాది అక్టోబరులో వెలుగొండ నీళ్లు ఇవ్వాలంటే పనులు యుద్దప్రాతిపదికన జరిగితేనే సాధ్యమవుతుంది..










