Oct 25,2022 13:32

అమరావతి : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సేవలు నిలిచిపోయినట్లు డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. గ్రూపుల్లో మెసేజులు వెళ్లడం లేదని, వ్యక్తిగత మెసేజులు పంపిస్తే బ్లూటిక్‌ రావడం లేదని పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సాప్‌ వెబ్‌కి కనెక్ట్‌ చేస్తున్నప్పుడు 'కనెక్టింగ్‌' అని వస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. మిగతా సోషల్‌ మీడియా ఆప్‌లన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. వాట్సాప్‌ మాత్రమే ఆగిపోయింది.

భారత్‌ సహా 150 దేశాల్లో వాట్సాప్‌ సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌ కు 48 కోట్ల మంది వినియోగదారులున్నారు. 60 ప్రాంతీయ భాషల్లో వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. ప్రతి రోజూ 10వేల కోట్ల మెసేజులు బట్వాడా అవుతున్నాయి. వాట్సప్ డౌన్ కావడంతో వినియోగదారులంతా టెలిగ్రామ్ కు స్విచ్ అవుతున్నారు.

అయితే, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని మెటా సంస్థ తెలిపింది. వాట్సప్‌ను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు. వాట్సాప్‌ పనిచేయడం లేదని తెలీడంతో అప్పుడే నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ రూపొందిస్తున్నారు. వాట్సాప్‌ యూజర్లంతా ట్విటర్‌వైపు పరుగులు తీస్తున్నారని ఒకరు కామెంట్‌ పెడితే.. వాట్సాప్‌కు గ్రహణం పట్టిందంటూ మరొకరు ట్వీట్‌ చేశారు.