పెదవేగి (ఏలూరు) : కలుషిత ఆహారం తిని 82 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం అర్థరాత్రి ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగింది. గ్రామంలోని నవోదయ పాఠశాలలో నిన్న రాత్రి వెజ్ బిర్యానీ తిన్న 82 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వీరందరినీ స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం దాదాపు 52 మందిని నిన్న అర్ధరాత్రి ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఎస్‌పి మేజర్ ప్రశాంతిలు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.