Jul 10,2023 07:35

అక్కడ కాసేది ఎండకాదు
అధికారం,

అక్కడి ఆకాశంలో విహరించేది
మదము మత్తు కలగలిసిన 'రొచ్చుమబ్బు'

బాకీపడ్డ చినుకులకోసం ప్రార్థించే చెమటపూలచెట్టు మీద
విసర్జనమలినజలాన్ని కురిపిస్తుందది నిర్లజ్జగా

అవమానం చెట్టుకి కాదు
తలవొంచుకోవాల్సింది చెట్టూ కాదు

అది సతత హరితఛత్రం,
దానికి తలవంపులేమిటి?

నేరం వర్షించిన మర్మావయానిదా?!
ఛీకొట్టాల్సింది విశాలనిర్మల వినీలాకాశాన్నా?!

నిందించాల్సిందీ.. నిలదీయాల్సిందీ
మూత్రమేఘాన్ని వెంటేసుకు తిరిగే పోకిరి గాలిపోగును

మూఢంలో ఉరుములహామీలతో ఆకాశాన్ని ఆవరించి
కార్తీకంలో పట్టుపీతాంబరాల్లా రెపరెపలాడుతుంటాయవి

చేసేది గర్జనల శుష్కవాగ్దానాలే తప్ప
జలధారల్ని వర్షించవుగాక వర్షించవవి

కాషాయవర్ణమేఘమాలను కాదు వానకోసం అర్థించాల్సింది,
కరిసమూహాల్లాంటి కారుమబ్బుల్ని

చెట్టుమొదట్లో మోకరిల్లాల్సిందెవరు?
మూత్రవర్షం కురిపించిన మదోన్మత్త పోకిరిమేఘం కదా!

మేఘాధిపతినని వొచ్చి కన్నీటితో కడగడమొక నాటకమని
ప్రతిచెట్టుకీ పుట్టకీ రాయకీ రప్పకీ తెలుసును

అదొక ప్రచార పటాటోపం..అధికారార్భాటం
నాటకంలో కీలకమైన అంతర్భాగం

ఎప్పుడో ఒక సందెవేళ నారింజరంగులు వెలిసిపోతాయి
చీకటిపాలనకు తెరపడుతుంది

మనం చేయవలసిందల్లా
ఉచ్చమబ్బేదో.. వర్షమేఘమేదో గుర్తించడమే.

- లాంగుల్య