Sep 26,2023 21:21
  • బ్యాంక్‌ ఉద్యోగుల తొలి కర్తవ్యం అదే..
  • లక్ష్యాలు కాదు
  • ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ వెల్లడి

ముంబయి : ఖాతాదారుల ఆర్థిక అవసరాలను తీర్చడమే బ్యాంక్‌ ఉద్యోగుల ప్రాథమిక బాధ్యత అని ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ స్వామినాథన్‌ జె అన్నారు. ఆ తర్వాతే లక్ష్యాలపై దృష్టి సారించాలన్నారు. ఖాతాదారుల ఫిర్యాదులపై మంగళవారం ప్రధాన బ్యాంక్‌ల ఉన్నతాధికారులతో స్వామినాథన్‌ మాట్లాడుతూ.. ఉత్పత్తి అనుకూలతపై బ్యాంక్‌లు ఓ విధానాన్ని కలిగి ఉండాలని సూచించారు. 'బ్యాంకులు వాణిజ్య సంస్థలు అయినందున లక్ష్యంతో నడపబడటంలో తప్పు లేదు. కానీ.. ఖాతాదారుల ఆర్థిక అవసరాలను తీర్చడమే తమ ప్రాథమిక బాధ్యత అని ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. కేవలం అమ్మకాలు చేయడం కంటే నాణ్యమైన ఆర్థిక సలహాలు, సేవలను అందించినందుకు ఉద్యోగులకు రివార్డ్‌లు ఇచ్చే స్పష్టమైన, పారదర్శక ప్రోత్సాహక నిర్మాణం ఉండాలి. ఇందుకోసం ప్రతీ ఆర్థిక సంస్థ ఒక ప్రత్యేక విధానాన్ని కలిగి ఉండాలి. ఫిన్‌టెక్‌ భాగస్వామ్యంతో ఏదైనా ఉత్పత్తి లేదా సేవను అందించినప్పుడల్లా బ్యాంకులు తగిన పర్యవేక్షణ కలిగి ఉండాలి. బ్యాంకులు ఫిన్‌టెక్‌ని ఒక అవకాశంగా చూడాలి తప్పా ముప్పుగా భావించకూడదు.'' అని స్వామినాథన్‌ అన్నారు. సమస్యలు, పిర్యాధుల పరిష్కారంలో బ్యాంక్‌లు విఫలమైతే.. లేదా నిజాలను దాచి పెడితే ఆర్‌బిఐ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఫిర్యాదు మూలకారణాన్ని పరిష్కరించడం, ఫిర్యాదులను బాధ్యతాయుతంగా నిర్వహించడం, సైబర్‌ క్రైమ్‌ను ఎదుర్కోవడం వంటి కీలక రంగాలపై బ్యాంకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్వామినాథన్‌ అన్నారు బ్యాంకు ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించకుండా జాగ్రత్త వహించాలన్నారు.