- హక్కులు దక్కక రైతులకు చిక్కులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సాదా బైనామాలు (ఒప్పంద పత్రాలు) రాసుకొని భూములు కొనుగోలు చేసిన..పంపకాలు చేసుకున్న రైతులు వాటికి రికార్డుల పరంగా హక్కులు దక్కక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ భూముల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా రైతులకు అవకాశం కల్పిస్తున్నా..ఆ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. క్రమబద్ధీకరణ కోసం దరకాస్తు చేసుకునే గడువు తేదీలను పెంచుతున్నా..వాటిని పరిష్కరించి హక్కులు కల్పించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. దీంతో లక్ష్యిత ఫలితాలు రాబట్టలేకపోతోంది. సాదా బైనామాల కింద క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుల గడువును తాజాగా 2023 డిసెంబరు 31వరకు పెంచుతూ ప్రభుత్వం శనివారం గెజిట్‌ను విడుదల చేసింది. జీఓ 633 అమలుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వం గడువు సమయాన్ని పెంచుతున్నప్పటికీ సాదా బైనామాల సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం దొరకడం లేదనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులకు పరిష్కారం చూపించడంలో రెవెన్యూ యంత్రాంగం ఆశించినస్థాయిలో కృషి చేయలేకపోయింది. మండల స్థాయిలోని రెవెన్యూ అధికారులు ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపుతూ దరఖాస్తులను పెండింగ్ జాబితాలో చేర్చడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2021 నవంబరు 1వ తేదీ నాటికి ఉన్న సాదాబైనామా భూములపై జరిగిన కొనుగోలు, బదిలీలు, మార్పిడీలను క్రమబద్దీకరించాల్సివుంది. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకొని వేచిచూస్తున్న రైతుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు ఒక్క కర్నూలు జిల్లాలోనే 5,232 ఎకరాల సాదా బైనామా భూములకు సంబంధించి హక్కుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఇవి తప్పనిసరి ..
గ్రామ అడంగల్‌లో భూమి సాగుదారుగా రికార్డు అయివుండాలి. దరఖాస్తుదారుడు ఆయా భూములకు సంబంధించిన శిస్తు, నీటి తీరువా రశీదులు జత చేయాల్సివుంటుంది. క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల ఆధీనంలోనే సదరు భూములున్నట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలితే అప్పుడు హక్కుల కల్పనకు మార్గం సుగమమైనట్లే. రశీదులు కానీ, లేదా ఇతర ఆధారాలు కానీ లేకపోయినా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న భూమి దరఖాస్తుదారుడే సాగుచేస్తున్నట్లు గ్రామస్తులు విచారణలో చెప్పినా క్రమబద్ధీకరణ చేయాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవీ సమస్యలు
సాదా బైనామాల గురించి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు క్రమబద్ధీకరణ కోసం విఆర్‌ఒలను సంప్రదించినప్పుడు ..తాము చేయలేమంటూ చెబుతుండటంతో చాలా మంది దరఖాస్తు చేయడానికి కూడా సాహసించడం లేదు. చాలా భూమల విషయంలో యజమానులు చనిపోవడం, భూముల విలువలు అమాంతం పెరిగిపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో వాటిని క్రమబద్ధీకరణ కోసమంటూ తిరగతోడితే లేనిపోని చిక్కులు తలెత్తి ఆధీనంలో ఉన్న భూమికే ఎసరు తప్పదనే భయాందోళన పలువురు రైతుల్లో వ్యక్తమవుతోంది. రైతులకు అవగాహన కల్పించాల్సిన రెవెన్యూ అధికారులు కూడా ఆ పని చేయకుండా ఈ తరహా భయాందోళనలను ప్రేరేపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోరి ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకనే మీమాంషతో రైతులు ప్రాథమిక స్థాయిలోనే దరఖాస్తు చేసుకోవడం లేదన్న రెవెన్యూ శాఖలోని పలువురు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం అమల్జేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సివుంది. భూములపై హక్కులకు సంబంధించిన రికార్డులు లేకపోవడంతో సాదాబైనామాల రైతులు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునేవీల్లేకుండాపోతోంది. దీంతో ఆ పథకాలకు వారంతా దూరమవుతున్నారు.
సాదా బైనామా భూములంటే ?
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైతులు భూముల క్రయ విక్రయాలు చేసుకుని స్టాంపు పత్రం మీద వివరాలు రాసుకొని ఒప్పందాలు చేసుకున్నారు. వీటిని వివిధ కారణాలతో రిజిస్ట్రేషను చేసుకోలేదు. ప్రధానంగా సోదరుల మధ్య భూముల పంపిణీ, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములను పంచుకొని ఒప్పందాలు రాసుకోవడం వంటివి ఉన్నాయి. ఇదే సమయంలో వీరి నుంచి భూములు కొనుగోలు చేసినవారు కూడా ఒప్పందం ప్రాతిపదికనే భూములు స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్నా..వాటిని ఏళ్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ విధంగా అన్ రిజిస్టర్డు డాక్యుమెంట్ ( సాదా బైనామా) కలిగియున్న వారికి తాము కొనుగోలు చేసిన, వాటాలు పంచుకున్న భూములు తమ ఆధీనంలోనే ఉన్నా..సాగు చేసుకుంటున్నా సరే రెవెన్యూ పత్రాల పరంగా హక్కులు మాత్రం ఉండవు. దీనివల్లే అనేక సంక్షేమ పథకాలకు సాదా బైనామా భూముల రైతులు దూరం అవుతున్నారు. క్రమబద్ధీకరణ కోసం గడువు పెంచుతూ పోతున్న ప్రభుత్వం ఈ అంశంపై తగిన ప్రచారం కూడా విస్తృతంగా చేపట్టి రైతుల్లో అవగాహన కల్పించి హక్కులు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఇవీ మార్గదర్శకాలు
- ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం సాదాబైనామాల క్రమబద్దీకరణకు రైతులు నిరిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
- గడువుకు సంబంధించిన సమాచారాన్ని, మార్గదర్శకాలను రైతులకు వివరించేందుకు తహసీల్ధార్లు విస్తృత ప్రచారం చేయాలి.
- గ్రామ సచివాలయాల నుంచి ఆయా గ్రామాలకు సంబంధించిన అర్జీలను స్వీకరించాలి.
- రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన 30 రోజుల్లోగా వాటిని పరిష్కరించాలి.










