- మహిళలపై పెరుగుతున్న దాడులు
- చర్యలు నామమాత్రం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మగువకు రక్షణ లేకుండా పోయింది. గడిచిన ఆరు నెలల్లో మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులే ఇందుకు నిదర్శనం. ఏప్రిల్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం నుంచి ఈ నెల 14న విజయవాడలో మైనర్ బాలికపై అత్యాచారం వరకు ఏదో రూపంలో వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం కడప జిల్లా రాచాయపేటలో బాలికపై అత్యాచారం జరిగింది. వీటిపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఆందోళన కరంగా ఉంది. వెలుగులోకి వచ్చిన ఘటనలు పదుల సంఖ్యలో ఉంటే వెలుగులోకి రాకుండా ఉన్నవి ఈ ఆరు నెలల్లో వందల సంఖ్యల్లో ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్ 19న విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో యువతిపై 30 గంటలపాటు అత్యాచారం చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా తుమ్మపూడి గ్రామంలో వివాహితపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత రేపల్లే రైల్వే స్టేషన్‌లో వివాహితపై అత్యాచారం చేశారు. ఈ ఘటన జరిగిన ఐదు రోజుల్లోనే ఫార్మసీ విద్యార్థిని సామూహిక అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా శుక్రవారం విజయవాడలోని ఫకీర్‌గూడెంలో, అదేవిధంగా శనివారం కడప జిల్లా గోపవరం మండలం రాచాయపేటలో బాలికలపై అత్యాచారాలు జరిగిన సంఘనలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో వరుస సంఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వం, పోలీస్‌శాఖ తీసుకుంటున్న చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. 15 నెలల క్రితం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నివాసానికి కూతవేటు దూరంలో సీతానగరం ఘాట్ వద్ద యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తిని పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు. కొన్ని ఘటనల్లో నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం తీసుకోవడం లేదు. మహిళలపై దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా చట్టం, యాప్ కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి. మహిళా కమిషన్.. బాధితులను పరామర్శించడం తప్ప ఆయా సంఘటనల్లో పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి తరువాత ఆరా తీయడం లేదు. అనేక కేసుల్లో బాధితులకు నష్టపరిహారం కూడా అందడం లేదు. మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. జాతీయ నేర పరిశోధన దర్యాప్తు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) నివేదిక ప్రకారం 2021లో మహిళలపై 17,736 నేరాలు జరిగాయి. 2020లో ఈ దాడుల సంఖ్య 17,089గా ఉంది. అంటే ఏడాదిలో మహిళలపై జరిగే దాడులు 4 శాతం పెరిగాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మహిళలపై వివిధ రూపాల్లో జరిగిన దాడుల కేసులు 59 వేలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అందరూ కోరుతున్నారు.










