
సమస్యల రాతి గోడల కింద పడి
మనుషులు విలవిల్లాడుతుంటారు
దేన్నైనా ఎంతటి బరువునైనా
ఎవడి భుజం మీద వాడు మోయాల్సిందే !
ఎవడి చేతులు వాడికి ఊతమవ్వాల్సిందే
నీ చెలిమో నీ రక్త సంబంధమో
కాసేపు ఓదార్పుల వింజామరలు విసిరి సేద దీర్చవచ్చు
లేదూ -
హృదయమున్న మనసు అంత ఆసరాగా
కొంత బాసటగా నిలబడవచ్చు
నీ అవసరం ఈ లోకానికి
ఇంకా ఉందని రక్షించుకోవచ్చు
అయినా నీ యాతన నీదే
వెన్నెల లోకానికి నీ ప్రయాణం నీదే
నీ బతుకు యుద్ధం నీదే
బతికున్నంతవరకు మనిషికి
సంఘర్షణ తప్పదు!
రేపటిరోజున నీ కళ్లు నీ కాళ్లు నీ సమస్త శక్తుల్తో
నీ గమనం ముందుకు సాగిపోవాల్సిందే
నీ చెమటతో నీ చాకిరితో
నీ ఊపిరి నువ్వు పోసుకోవాల్సిందే
నువ్వు నువ్వై జీవించాల్సిందే!
మనిషిప్పుడు సమూహంలో ఒంటరివాడు
వేవేల ప్రాణుల నడుమ ఏకాకి
సాలె పురుగు గూట్లో
పడి తన్నుకుంటున్న చిన్ని కీటకం -
ఇక్కడ నేలంతా సంపద చుట్టూనే
పరిభ్రమణమౌతుంది కదా
తెలుసో తెలియకో నీ చేతిలో
ఇనుప గొడ్డలి జారిపోతే
స్వర్ణ కుటారం తెచ్చి ఇచ్చే ఏ వన దేవత లేని స్థలమిది
నీ నీతినీ నిజాన్నీ సత్య వ్రతాన్నీ
ప్రశంసించే కాలం కాదిప్పుడు
పెనుగాలికి కూలిన వృక్షం
మట్టిలోని వేర్లు బిగువుతో
నాలుగు చినుకుల సాయంతో
తనకై తాను పైకి లేచినట్లు
నిటారుగా నిలబడి చిగురించాలి
లేచిపోయిన పిట్టల్ని మళ్లీ పిలిచి
చిటారి కొమ్మల తలలపై కూర్చోబెట్టుకోవాలి
ఎండిపోయిన వాగులోకి
ఏదో ఒక సమయాన వరద నీళ్లు రావాలి
సమస్యల ముళ్ల దారిలో
మనుషులు నడుస్తూ కన్నీరౌతుంటారు
రోగాల్తో, మూగ వేదనల్తో సతమతమౌతుంటారు
ఊబిలో పడ్డ మృగంలా బేలగా చూస్తుంటారు
మనిషి పుట్టుక సమస్య
మనిషిగా బతకడం,
బతకాలనుకోవడం సమస్య
మనిషికి స్వేచ్ఛనీ శ్రమనీ ప్రేమనీ
ఇవ్వడం, తీసుకోవడం
అందరికీ పంచి పెట్టడం సమస్య!
సమస్యల్ని జయించిన వాడే దృఢచిత్తుడు
సమస్యల్ని ఎడం కాలితో తన్ని
స్థిరంగా ఉండగల్గిన వాడే వీరుడు
సమస్యల చిక్కు దారాల్ని
వీలైనంత ఓర్పుగా, ఓపిగ్గా, అలవోకగా
విడదీయగలిగివాడే అసలైన శాంతమూర్తి
నోరుంది, మాటుంది,
రచ్చబండ మీద రమణీయమైన
వాక్య సముదాయం ఉంది
మనిషీ! పోదాం పద
మనిషికి ఇంకేం కావాలి
మనిషికి ఇంకేం లభించాలి!
- రవి నన్నపనేని
9182181390